రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం మానవ అక్రమ రవాణా వ్వతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ. కె.ప్రకాష్ బాబు , ఇంటర్నేషనల్ స్కూల్ ఇఫ్ టెక్నాలజి అండ్ సైన్స్ ఫర్ ఉమెన్స్ (ఐ. ఎస్.టి.ఎస్ ఇంజనీరింగ్ కాలేజీ), రాజానగరం నందు విధ్యార్థినిలకు “మానవ అక్రమ రవాణా”, “మాదక ద్రవ్యాల నిషేధం” మరియు “ఆంధ్ర ప్రదేశ్ ర్యాగింగ్ నిషేధ చట్టం, 1997” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రకాష్ బాబు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాకు ముఖ్య కారణాల గురించి వివరించారు. కుటుంబ సభ్యులతో తగినంత సమయం గడపకపోవడం అదే సమయంలో వివిధ సామాజిక మాధ్యమాలలో అపరిచితులతో స్నేహాల వల్ల అక్రమ రవాణాకు గురవుతున్నారని తెలిపారు. కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే ఇలాంటి నేరాలు తగ్గుతాయన్నారు. అక్రమ రవాణా గురవుతున్న బాధితులను కాపాడేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు తీసుకోవలసిన చర్యలు ఏమిటి, అటువంటి బాధితులకు అందుబాటులో ఉన్న న్యాయ సేవల గురించి వివరించారు. నల్సా వారి “అక్రమ రవాణా బాధితులు మరియు వాణిజ్య పరమైన లైంగిక దోపిడీ బాధితుల పథకం, 2015” ద్వారా అందిస్తున్న సేవల గురించి తెలిపారు. మానవ అక్రమ రవాణా, తప్పిపోయిన కేసుల లో ఉచిత న్యాయ సహాయం కొరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని అన్నారు. “ఎన్.డి.పి.ఎస్. యాక్ట్, 1985” పై అవగాహన కల్పిస్తూ మాదక ద్రవ్యాలను కలిగి ఉండడం, సేవించడం, సరఫరా చేయడం, తయారీ, క్రయ విక్రయాలూ… అన్నీ క్రిమినల్ నేరాలు అని, వీటికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఇటువంటి నేరాలలో పట్టుబడితే వారి భవిష్యత్తు దెబ్బతింటుందని, కాబట్టి అందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డి.ఎస్.పీ ఆది నారాయణ , ఐ.సి.డి.ఎస్. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారి కె. విజయ కుమారి , అసిస్టెంట్ బి.సి వెల్ఫేర్ ఆఫీసర్ సత్య రమేష్ , కళాశాల ప్రిన్సిపల్ డా.వై. రాజశ్రీ రావు , పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.