అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమగ్ర ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా క్యాన్సర్ ను ప్రాథమికంగా గుర్తించే దిశలో అనపర్తి నియోజకవర్గంలో ఇంటింటి సర్వే చేపట్టి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వ్యాధి నివారణకు తగు వైద్యం అందించాలనే దృక్పథంతో ముందుకు వెళుతున్న శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభినందనీయులని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. గురువారం బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామంలో ఎమ్మెస్సార్ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపును అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు కార్పొరేట్ వైద్యులు, ఐ ఎమ్ ఏ ప్రతినిదులు, వైద్య అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ అనపర్తి నియోజక వర్గంలో ఆరోగ్యపరంగా ఇంటింటి సర్వే చేసి క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించే దిశగా ఇటువంటి సేవ కార్యక్రమాలు చేపట్టడం మంచి శుభ పరిణామం అన్నారు. ఈ ప్రాంతం నుంచి శాసన సభ్యులుగా నల్లమిల్లి మూలారెడ్డి ఆరు పర్యాయాలు ప్రజలకు సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన వారసుడిగా నేడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శాసన సభ్యులుగా ప్రజా ప్రజా సేవకుడిగా ప్రజల మధ్యనే ఉంటూ రెండో సారి ఎమ్మెల్యే అయ్యారన్నారు. ఇందులో భాగంగానే నేడు ట్రస్ట్ , జి ఈ ఎల్ హాస్పిటల్, ఐఎంఏ సహకారంతో మెడికల్ క్యాంపు, రక్త దాన శిబిరం నిర్వహించుకుంటున్నమని పేర్కొన్నారు.. ప్రజా ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడం తో పాటు వాటిని అధిగమించే క్రమంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినంద నీయంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మూల్లారెడ్డితో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్పీకర్ గుర్తు చేసుకున్నారు.
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబంతో ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలు చరిత్ర గలిగిన నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. శ్రీశైలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి పర్యటన ఉన్నప్పటికీ ముందుగా ఖరారు అయిన షెడ్యూల్ మేరకు ముఖ్యమంత్రి వారి ఆదేశాల తో నేడు స్వర్గీయ నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం జరిగిందని మంత్రి తెలిపారు.
స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనపర్తి గ్రామ ప్రజల తెలుసుకునేందుకు ఇంటింటి ఆరోగ్య సర్వే చేపట్టి క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం జరుగుతుందన్నారు. పైలట్ ప్రాజెక్టు గా అనపర్తి ఎంపిక కావడం జరిగిందన్నారు. జి.ఎస్.ఎల్ ఆసుపత్రి, ట్రస్ట్ ఆసుపత్రి, ఐఎంఏ సహకారంతో రు. 25 వేల రూపాయల వరకు ఉచితంగా వైద్యాన్ని అందించడం కోసం ముందుకు వొచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ, కొత్తపేట బండారు సత్య నందం, మాజీ మంత్రి కె ఎస్ జవహార్, బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు స్వామి వీర్రాజు, జి ఎస్ ఎల్ చైర్మన్ గన్ని భాస్కర్ రావు, ట్రస్ట్ హాస్పిటల్ ఛైర్మన్ రామకృష్ణ , వైద్యులు రామలింగారెడ్డి లక్ష్మారెడ్డి, స్థానిక నాయకులు, జి.ఎస్.ఎల్ ఆసుపత్రి, ట్రస్ట్ ఆసుపత్రి, ఐఎంఏ తదితరులు పాల్గొన్నారు.