-కేబర్స్ కారాగారం ఖైదీలకు కళ్ళ అద్దాలు పంపిణి
-పర్యవేక్షణాధికారి ఎస్ రాహుల్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కంటి చూపు పట్ల భద్రత, ఆరోగ్యం పట్ల అందరూ శ్రద్ధ వహించాలని రాజమండ్రి కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ పేర్కొన్నారు. సోమవారం కేంద్ర కారాగారంలో ఖైదీలకు నేత్ర పరీక్షలు అనంతరము ఆయన 210 మంది ఖైదీలకు కళ్ళజోళ్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సర్వేంద్రియేనాం నయనం ప్రధానం’ అన్నారు. ఖైదీలకు పరీక్షలు చేయడానికి ముందుకొచ్చిన వేమగిరి పరమహంస యోగానంద “నేత్రాలయం” యాజమాన్యానికి కళ్ళజోళ్ళు బహుకరించిన “ఆమెన్ ” స్వచ్ఛంద సంస్థకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలకు స్వయంగా కళ్ళజోళ్ళు తొడిగారు. కళ్ళజోళ్లను అవసరమైనప్పుడల్లా వాడుతూ కళ్ళని భద్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం అన్నారు. ఖైదీల మానసిక పరివర్తన కోసం, ఆరోగ్యం కోసం జైళ్ల శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. వాటిని ఖైదీలు సద్వినియోగపరచుకోవాలని రాహుల్ కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప పర్యవేక్షణాధి కారులు ఎం రాజకుమార్, బి రత్న రాజు మాట్లాడుతూ ఖైదీలు ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉంటూ జైల్లో నిర్వహిస్తున్న ఆస్పత్రి సేవలను ఉపయోగించుకోవాలన్నారు. ఖైదీల మెరుగైన ఆరోగ్యం కోసం నిరంతరము రక్త పరీక్షలు చేసి తగిన వైద్య సేవలు కూడా అందిస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ జైలర్ శ్రీనివాసరావు, వైద్యాధికారిణి డా కోమల ఇతర జైలు సిబ్బంది పాల్గొన్నారు.