-ఉద్యోగుల సార్వత్రిక గుర్తింపు నంబరు ద్వారా వివరాలన్నీ కనపడేలా అప్డేట్ చెయ్యాలి
-ఉద్యోగి పనిచేస్తున్న ప్రదేశం, బయట వేసిన అటెండెన్స్ వివరాలు కూడా తెలియాలి
-నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల అటెండెన్స్ తెలిసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
-పీహెచ్‌సీలో , బయటా మెడికల్ ఆఫీసర్ల అటెండెన్స్ తెలుసుకునేలా యాప్ లో లొకేషన్లను పొందుపర్చాలి
-ఎఫ్ఆర్ యస్ నిర్వహణ తీరుపై లోతుగా సమీక్షించిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగులు ఉపయోగిస్తున్న (Facial recongnition system) ఎఫ్ ఆర్ యస్ యాప్ నిర్వహణ తీరు సరిగా లేదని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం ద్వారా దీన్ని మరింతగా మెరుగుపర్చుకోవాల్పి ఉందన్నారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల కల్లా రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ వారీగా ఉద్యోగుల అటెండెన్స్ వివరాల్ని అందజేయాలని ఆయన సంబంధిత అధికారుల్ని అదేశించారు. ఉద్యోగుల సార్వత్రిక గుర్తింపు సంఖ్య(యునిక్ నంబరు)ను బట్టి పూర్తి వివరాలు కనపడేలా యాప్‌ను అప్డేట్ చెయ్యాలన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల అటెండెన్స్ తీసుకునేందుకు వీలుగా ప్రస్తుత యాప్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. గురువారంనాడు మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఎఫ్ ఆర్ యస్ యాప్ నిర్వహణ తీరును ఆయన లోతుగా సమీక్షించారు. రాష్ట్రంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మరో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది ఎఫ్ఆర్ యస్ లో అటెండెన్స్ వేసిన తీరుపై ఆరా తీశారు. మెడికల్ ఆఫీసర్ అటెండెన్స్ వేశాక ఉదయాన్నే అర్లీ ఎగ్జిట్(తొందరగా వెళ్లిపోయినట్లు) అని చూపించడం పట్ల ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అర్లీ ఎగ్జిట్ అవడానికి గల కారణాలు యాప్‌లో కనిపించాలి కదా అని ఆయన ప్రశ్నించారు. పని చేస్తున్న ప్రదేశం(Health Fecility ), ఉద్యోగుల వారీగా వివరాల్ని ఒక్క క్లిక్ ద్వారా తెలుసుకునేలా సాంకేతికతను రూపొందించాలన్నారు. పని చేస్తున్న ప్రదేశంలో, బయటా అటెండెన్స్ వేసినప్పుడు అందుకు సంబంధించిన లొకేషన్ కూడా యాప్ లో కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనిచేయని రోజుల్ని సెలవులుగా చూపిస్తోందా లేదా అనే అంశంపై కూడా స్పష్టత ఉండాలన్నారు. కాకినాడలోని ఒక యుపిహెచ్సీలో 13 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు యాప్‌లో చూపించడం పట్ల కమీషనర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వాస్తవానికి యుపిహెచ్సీలో ఏడుగురు సిబ్బంది మాత్రమే పనిచేస్తారని, మిగతా ఆరుగురు ఎక్కడ్నించి వచ్చారని ఆరా తీశారు. ఇదే యుపిహెచ్సీలో 13 మందిలో డాక్టర్ ఒక్కరే అటెండెన్స్ వేసి మిగతా 12 మంది అటెండెన్స్ వేయకపోవడానికి గల కారణాల్ని ఆ డాక్టర్‌తో కమీషనర్ స్వయంగా ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. సదరు డాక్టర్ చెప్పిక కారణాలతో సంతృప్తి చెందని కమీషనర్ దీనిపై పూర్తి నివేదికను అందజేయాలని ఆదేశించారు. పని చేస్తున్న ప్రదేశంలో గానీ, బయట గానీ ఎక్కడ అటెండెన్స్ వేసినా లొకేషన్ తెలిసేలా ఉండేలా సాంకేతికపరమైన అంశాల్ని సరిచేసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా పని ప్రదేశం, బయట డాక్టర్ల ఎఫ్ఆర్ యస్ అటెండెన్స్ వివరాల్ని ప్రతి రోజూ ఉదయం 10 గంటల కల్లా అందజేయాలని ఆదేశించారు. యాప్‌లో ఉన్న విధంగా నిర్ణీత డ్యూటీ వేళల్లో ఉదయం , మధ్యాహ్నం, వెళ్లేటప్పుడు డాక్టర్లు వేసిన అటెండెన్స్ వివరాల్ని అందజేయాలన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉద్యోగులు, క్యాడర్ వారీగా అటెండెన్స్ సమాచారాన్ని తెలుసుకునేలా ఉండాలని, డేష్ బోర్డును కూడా డెవలప్ చేయాలని కమీషనర్ ఆదేశించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 మంది సిబ్బంది పనిచేస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా వారందరి అటెండెన్స్ వివరాల్ని తెలుసుకునేలా సమగ్ర విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఎఫ్ఆర్ యస్ యాప్ ను రూపొందించిన సంస్థ ప్రతినిధులతో తక్షణమే సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఎఫ్ఆర్‌యస్ విభాగం నుండి సురేష్, అజిత, ఐ.టి కన్సల్టెంట్ సమీక్షలో పాల్గొన్నారు.