Breaking News

‘స్టార్‌’గా మారండి.. ‘స్మార్ట్‌’గా ఆదా చెయ్యండి

-స్టార్‌ లేబులింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రోత్సహించే ప్రయత్నాలు ముమ్మరం చెయ్యాలంటూ ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల ఎస్‌డీఏలకు బీఈఈ విజ్ఞప్తి
-ఈ కార్యక్రమంతో విద్యుత్‌ పొదుపుతో పాటు.. వినియోగదారులకు డబ్బు ఆదా
-ఇంధన వనరుల సంరక్షిత భవిష్యత్తు వైపు నడిపించే ప్రోగ్రామ్‌ ఇది
-ఇప్పటి వరకూ దేశంలో రూ.30 వేల కోట్ల విద్యుత్‌ ఆదా చేసేందుకు
దోహదపడిన ఎస్‌ అండ్‌ ఎల్‌ ప్రోగ్రామ్‌
-భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి, ఇంధన సామర్థ్య ప్రోత్సాహంతో అడుగులు వేస్తున్నామన్న ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్‌
-ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చేలా స్టార్‌ రేటెడ్‌ ఉపకరణాలు వినియోగించుకోవాలని విద్యుత్‌ వినియోగదారులకు బీఈఈ పిలుపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌తో సహా దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలూ ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా.. స్టార్‌ లేబులింగ్‌ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషిఝెన్సీ (బీఈఈ) విజ్ఞప్తి చేసింది. వినియోగదారులకు సాధికారత కల్పించడం, విద్యుత్‌ పొదుపును పెంపొందించడం లక్ష్యంగా చొరవ తీసుకుంటూ విస్తృత ఇంధన సామర్థ్యం, పర్యావరణ స్థిరత్వాన్ని సాధించడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది. ఏపీ స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌(ఏపీఎస్‌ఈసీఎం) సహా దక్షిణాది రాష్ట్రాల ఎస్‌డీఏలతో సమావేశాల్లో భాగంగా బీఈఈ దక్షిణాది రాష్ట్రాలు, యూటీల మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎస్‌ఈసీఎం సీఈవో బీఏవీ కుమార్‌రెడ్డితో కలిసి ఇంధన సామర్థ్యానికి సంబంధించిన సమగ్ర నివేదికని ఆంధ్రప్రదేశ్‌ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు అందజేశారు. ఎస్‌ అండ్‌ ఎల్‌ ప్రోగ్రామ్‌కి సంబంధించిన ప్రాముఖ్యత గురించి ఆయనకి వివరించారు. ఈ సందర్భంగా ఇంధన రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, నిబద్ధత గురించి స్పెషల్‌ సీఎస్‌ విజయానంద్‌ నొక్కి వక్కాణించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఏపీలో 24/7 నాణ్యమైన విద్యుత్‌ సరఫరాను అందించడానికి ప్రధమ ప్రాధాన్యమిస్తున్నామని వివరించారు. పర్యావరణ స్పృహతో ఇంధన భద్రతను నిర్ధారించే వ్యూహాత్మక కార్యక్రమంలో భాగంగా ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అంకితభావాన్ని ప్రదర్శిస్తోందని స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాల్ని అధిగమించే విధంగా.. గ్రీన్‌ ఎనర్జీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారిస్తోందని స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వివరించారు.

ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం..
ఇంధన వనరుల వినియోగానికి సంబంధించిన అంకితభావంతో విద్యుత్‌ పొదుపు కార్యక్రమాల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని విజయానంద్‌ పునరుద్ఘాటించారు. ఇంధన పొదుపు సామర్థ్య ప్రయత్నాలు రాష్ట్రానికి, విద్యుత్‌ రంగానికి మాత్రమే కాకుండా, విద్యుత్‌ వినియోగదారులకు, ఆర్థికాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణలోనూ కీలకమని అన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా ఇంధన సామర్థ్యం, పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించడంపై రాష్ట్రం మరింత దృష్టి సారిస్తుందని వెల్లడించారు.

ప్రతి వినియోగదారుడు ఒక ‘స్టార్‌’ కావాలి..
విద్యుత్‌ పొదుపు కార్యక్రమాల్లో ప్రతి వినియోగదారుడు ఒక స్టార్‌గా మారాలని బీఈఈ పిలుపునిచ్చింది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, ఎయిర్‌ కండిషనర్లు, ఎలక్ట్రిక్‌ కుక్కర్లు, ఫ్యాన్లు మొదలైన స్టార్‌–లేబుల్‌ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఉపయోగించడం వల్ల వినియోగదారులు లాభపడతారని సూచించింది. స్టేట్‌ డిసిగ్నేటెడ్‌ ఏజెన్సీ(ఎస్‌డీఏ)లతో కలిసి విపణి వీధిలో స్టార్‌ లేబులింగ్‌ ప్రోగ్రామ్‌(ఎస్‌ఎల్‌పీ)ని ప్రతి గ్రామానికి తీసుకెళ్తున్నామని బీఈఈ వెల్లడించింది. ఎస్‌డీఏలు, ఏపీఎస్‌ఈసీఎమ్‌తో కలిసి స్టార్‌ లేబుల్‌ ఉత్పత్తుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రచారం చేస్తూ.. వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు బీఈఈ స్పష్టం చేసింది.

విద్యుత్‌ ఆదా, పర్యావరణ పరిరక్షణే లక్ష్యాలుగా…
2006లో ప్రారంభించిన స్టార్‌ లేబులింగ్‌ ప్రోగ్రామ్‌(ఎస్‌ఎల్‌పీ) గేమ్‌–ఛేంజర్‌గా మారింది. ఇది ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, పరికరాల ఇంధన సామర్థ్యం–పొదుపు గురించి వినియోగదారులకు అవగాహన కల్పిస్తోంది. ఇంధన శక్తి సామర్థ్యం ఆధారంగా స్టార్‌ రేటింగ్‌ను (1–5 స్టార్‌లు) కేటాయిస్తుంది. 5 స్టార్‌ రేటింగ్‌ లేబుల్‌ ఉంటే అత్యంత సమర్థవంతమైన మోడల్‌గా సూచిస్తుంటుంది. ఈ 5 స్టార్‌ రేటింగ్‌ పరికరాలు.. విద్యుత్‌ బిల్లులపై డబ్బును ఆదా చేయడమే కాకుండా పర్యావరణానికి కూడా ప్రయోజనం చేకూర్చనున్నాయి. ఈ లేబుల్‌పై సంబంధిత సమాచారాన్ని కూడా సమగ్రంగా ముద్రించడంతో వినియోగదారులకు దీనిపై పూర్తి అవగాహన కలుగుతోంది. గణనీయమైన విద్యుత్‌ పొదుపుతో పాటు సీఓ2 ఉద్గారాల నియంత్రణకు స్టార్‌ లేబులింగ్‌ ప్రోగ్రామ్‌ ఉపయుక్తమయ్యింది. దేశవ్యాప్తంగా ఎస్‌ఎల్‌పీ ద్వారా 2019 నాటికి 109 బిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఆదాతో పాటు 88 మిలియన్‌ టన్నుల సీవో2 ఉద్గారాల నియంత్రణకు దోహదపడింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 56 బిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఆదా చేసింది. దీని ద్వారా దేశంలో రూ.30,000 కోట్ల ఖర్చు ఆదాతో పాటు 46 మిలియన్‌ టన్నుల సీవో2 ఉద్గారాలు నియంత్రించగలిగామని బీఈఈ వెల్లడించింది.

దక్షిణాది రాష్ట్రాలకు సంపూర్ణ మద్దతు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక, అండమాన్‌ – నికోబార్‌ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలకు తమ సంపూర్ణమద్దతు ఉంటుందని బీఈఈ ప్రకటించింది. పెరుగుతున్న దేశీయ ఇంధన డిమాండ్ల మధ్య స్థిరమైన ఇంధన పద్ధతుల ప్రాముఖ్యతగురించి వివరించింది. స్టార్‌ లేబులింగ్‌ ప్రోగ్రామ్‌లో మరిన్ని ఉపకరణాలను చేర్చే దిశగా ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నట్లు బీఈఈ వెల్లడించింది. రాష్ట్రాలతో కలిసి హరిత భారతాన్ని నిర్మించేందుకు బీఈఈ సంపూర్ణ సహకారం అందించనుందని స్పష్టం చేసింది. వినియోగదారుల సాధికారత, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు సారథ్యం వహిస్తూ.. ఎస్‌ఎల్‌పీ ఒక మార్గదర్శిగా మారుతూ.. దేశంలో ఇంధన వనరుల పొదుపులో సమర్థవంతమైన, స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తోంది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *