రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి పుష్కరాలు 2027 నిర్వహించినందుకు తగిన సమయం ఉన్నందున ఇప్పటినుంచే చక్కటి ప్రణాళికలతో ప్రజా ప్రతినిధుల సూచనలు సలహాలు మేరకు పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్దామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసు, ఎస్పీ డి నరసింహ కిషోర్, నగర పాలక సంస్థ మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ లతో వివిధ అంశాలపై చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, గతంలో జరిగిన పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని 2027లో నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాలకు వొచ్చే పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే యాత్రికులను, పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుని, వాటినీ అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులు సూచనలను సలహాలను పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకుంటా మన్నారు.
శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ, గోదావరీ పుష్కరాలు దృష్టిలో ఉంచుకుని రహదారుల అభివృద్ది, డ్రైనేజీ వ్యవస్థ సమస్యలను పరిష్కారం దిశగా అడుగులు వేయడం ముఖ్యం అన్నారు. ప్రతీ ఏటా వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి అవుతున్నాయని, వీటికి శాశ్వత పరిష్కారం కోసం నగరంలోనీ ప్రధాన డ్రెయిన్స్ కొన్ని ప్రాంతాల్లో వెడల్పుగా కొన్ని ప్రాంతాల్లో వెడల్పు తక్కువగా ఉండడంవల్ల ముంపు సమస్య ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. కోటగుమ్మ నుండి డీలక్స్ సెంటర్ వరకు అమృత్ కార్యక్రమం భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు గతంలో ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందన్నారు. కంబాల చెరువు ప్రాంతంలో వర్షాకాలంలో ముంపు సమస్య ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. నగరంలోని కొన్ని ప్రధాన రహదారులను వెడల్పు చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించడం సాధ్యమవుతుందన్నారు. ఆయా ప్రతిపాదిత పనులను చేపట్టేందుకు తగిన సమయం ఉందని మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు.. నగరంలో విస్తృత స్థాయిలో పర్యటించి డ్రైనేజీ వ్యవస్థ రహదారుల పై అవగాహనకు రావడం జరిగిందన్నారు.
ఎస్పీ డి నరసింహా కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన రహదారులలో ట్రాఫిక్ సమస్య ఉందన్నారు. ఆయా రహదారి మార్గాలను వెడల్పు చేయడము, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలపై ఇప్పటికే ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినట్లు పేర్కొన్నారు.