Breaking News

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి

-జిల్లా కలెక్టర్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారులందరూ సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి గుడివాడ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ గుడివాడ మున్సిపల్ కార్యాలయ సమావేశపు మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ముఖ్యమంత్రి అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం లబ్ధిదారుల కోసం టోకెన్ కొనుగోలు చేసి లోపలకి వచ్చి స్వయంగా వారికి వడ్డిస్తారని, వారితో ముచ్చటిస్తారని తెలిపారు. క్యాంటీన్లో నగదు చెల్లింపు కోసం క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలని, వెబ్ క్యామ్, ఇంటర్నెట్ కనెక్షన్, కంప్యూటర్ సామాగ్రి పూర్తిస్థాయిలో ఉండే విధంగా సరిచూసుకోవాలని సూచించారు. క్యాంటీన్ ఆవరణతో పాటు పరిసర ప్రాంతాలలో పారిశుధ్యం చేపట్టాలని, డ్రైనేజీల మురుగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆవరణలో మొక్కలు నాటాలని సూచించారు. వేదిక వద్ద అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్సులు, వైద్యులు, మందులు సిద్ధంగా ఉంచాలని, వేదిక అలంకరణ, బ్యాక్ డ్రాప్ స్క్రీన్, విద్యుత్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా జనరేటర్ల పనితీరును పరీక్షించుకోవాలని సంబధిత అధికారులకు సూచించారు. ప్రజా వేదిక వద్ద ముఖ్యమంత్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని, సమస్యల వారీగా అర్జీలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు.

కార్యక్రమానికి వచ్చే జర్నలిస్టులకు ఎటువంటి కెమెరాలు అనుమతించబడవని మరోసారి గుర్తు చేస్తూ వారికి ప్రత్యేకంగా లైవ్ లింక్ అందించేవిధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జర్నలిస్టులతో పాటు కార్యక్రమానికి వచ్చే ప్రజలకు స్నాక్స్, తాగునీరు క్రమ పద్ధతిలో అందించాలని సూచించారు.

ముఖ్యమంత్రి రాకపోకల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పాట్లపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గట్టి పోలీసు బందోబస్తు చేపట్టాలన్నారు. ఆయా అధికారులకు అప్పజెప్పిన పనులను సమర్థవంతంగా నిర్వహించి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఆయన గుడివాడ పురపాలక సంఘం 24వ వార్డులోని తుమ్మల రామబ్రహ్మం మున్సిపల్ పార్క్ లో గల అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సమావేశంలో గుడివాడ, ఉయ్యూరు ఆర్డిఓలు పి పద్మావతి, డి రాజు, గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్లు బాలసుబ్రమణ్యం, బాపిరాజు, వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ బి ఈఈ శ్రీనివాసరావు, డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జీ గీతాబాయి, ఐసిడిఎస్ పిడి సువర్ణ, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *