-జన్మభూమి 2.O జనవరిలో ప్రారంభం
-ముఖ్యమంత్రి చంద్రబాబు
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు కడుపునిండా తిండి పెట్టడం జీవితంలో సంతృప్తినిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి గురువారం గుడివాడలో తుమ్మల సీతారామపురం మున్సిపల్ పార్క్ లో అన్న క్యాంటీన్ పునః ప్రారంభించి, పేదలకు ఆహార పదార్థాలు వడ్డించారు. వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారులతో కలసి ముఖ్యమంత్రి దంపతులు భోజనం చేస్తూ వారు చేస్తున్న వృత్తులు వ్యాపారాలు, వారి కుటుంబాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు రాము అన్న క్యాంటీన్ వల్ల ఎలా ప్రయోజనం పొందామో ముఖ్యమంత్రి కి వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రజా వేదిక నుండి ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదలకు కడుపునిండా తిండి పెట్టడం జీవితంలో సంతృప్తిని ఇస్తుందని అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ జన్మస్థలం, తొలిసారిగా ఎమ్మెల్యే అయిన గుడివాడ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటుందన్నారు. డొక్కా సీతమ్మ అన్నదానంలో మేటి మహిళగా చరిత్రలో నిలిచారని అన్నారు. అన్న ఎన్టీఆర్ తిరుపతిలో అన్నదాన ట్రస్టు పెట్టారని, లక్ష మందికి అన్నం పెట్టిన ఆ మహనీయుని స్ఫూర్తిగా అన్న క్యాంటీన్లు 2018లో ఏర్పాటు చేసిన విషయం గుర్తు చేశారు. అన్ని దానాల్లో అన్నదానం మిన్న, సేవా భావంతో దాతలు ముందుకు రావాలని అందరికీ పిలుపునిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
చిరు వ్యాపారులు చేతివృత్తుల వారు కష్టపడి కూలి చేసుకునేవారికి వారికి పూటకు ఐదు రూపాయలు చొప్పున మూడు పూట్ల 15 రూపాయలకే కడుపునిండా అన్నం పెట్టడం తమ ప్రభుత్వం దూర దృష్టికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించుటకు ఈరోజు శ్రీకారం చుట్టామన్నారు. మంచి భవనంలో, మంచి ప్రదేశంలో, నాణ్యత, పౌష్టికాహార, నాణ్యమైన భోజనం అన్న క్యాంటీన్లలో అందిస్తున్నట్లు తెలిపారు సెప్టెంబర్ ఆఖరు నాటికి 203 అన్న క్యాంటీన్లు రాష్ట్రంలో పెడతామన్నారు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేస్తామన్నారు. హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్టు అక్షయపాత్ర వారు 11 ప్రాంతాలలో ఆధునిక కిచెన్ లో ఏర్పాటు చేశారని, పరిశుభ్రంగా ఆహారం తయారు చేస్తున్నరని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు.
2025 జనవరి లో జన్మభూమి 2.O ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు మళ్లీ గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడం మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. దేశంలో ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా, ప్రపంచంలో తెలుగుజాతిని నెంబర్ వన్ జాతిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు దాతృత్వం కలిగి ఉండాలని, వ్యాపార వర్గాలు తమకు వచ్చిన లాభాలలో కనీసం 5 శాతం దాతృత్వానికి వ్యయం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, గుడివాడ, అవనిగడ్డ, పెడన, పామర్రు, పెనమలూరు, గన్నవరం శాసనసభ్యులు వెనిగండ్ల రాము, మండలి బుద్ధ ప్రసాద్, కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు లు అందరూ కలిసి అన్న క్యాంటీన్లకు 50 లక్షల రూ.లు విరాళం అందజేస్తామన్నారని ముఖ్యమంత్రి ప్రకటించి, వారికి ధన్యవాదాలు తెలిపారు. దండమూడి చౌదరి 5,07,779/-విరాళం అందజేసి ప్రతి ఏడాది ఇదే మొత్తం విరాళంగా అందిస్తామని హామీ ఇచ్చారు.
అన్న క్యాంటీన్లకు విరాళాలు అందజేసేవారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ అకౌంట్ నెంబరు 37818165097, IFSC code SBIN0020541, అన్న క్యాంటీన్ వెబ్సైట్ annacanteen.ap.gov.in విరాళాలు పంపవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా కోటి రూపాయలు విరాళాలు అందజేసిన శ్రీనివాసరాజు మరియు ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి గార్లను ముఖ్యమంత్రి శాలువ, మెమెంటోలతో సత్కరించారు.
తొలుత ముఖ్యమంత్రి వివిధ వృత్తులు చిరు వ్యాపారాలు చేసుకుంటున్న పేదలతో మాట్లాడి అన్న క్యాంటీన్ ల వల్ల ఉపయోగం ఏమిటి అని ప్రశ్నించగా, గతంలో అన్న క్యాంటీన్ ల వల్ల వారు పొందిన ప్రయోజనాలు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వారి జీవన పరిస్థితులు కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
వలివర్తి పాడు కు చెందిన రేమల్లి రజనీకాంత్ ఆటో డ్రైవర్ గతంలో మీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం పొంది ఆటో ఓనర్ అయ్యానని తెలుపగా డీజిల్ ఆటోకు ఎంత వ్యయం ఎంత ఆదాయం వస్తుందో ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. డీజిల్ ఆటోను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుకుంటే ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని, నీ వాహనంతోనే ఈ విధానం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఈ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు సూచించారు.
రజినీకాంత్ ను నీ పిల్లలు ఏం చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించగా, ఆటో తోలి మా అబ్బాయిని బీటెక్ చదివించానని, ఇప్పుడు అతను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడని, తన చెల్లికి ఫీజు కట్టి బీడీఎస్ డాక్టర్ కోర్స్ చదివిస్తున్నాడని రజనీకాంత్ తెలుపగా, ముఖ్యమంత్రి అతని కొడుకు రవితేజను మనస్ఫూర్తిగా అభినందించారు.
తమ్మిశెట్టి నాగమణి సమీప గ్రామాలలో ఆటోలలో వెళ్లి గిల్టు నగలు విక్రయించి జీవనం సాగిస్తున్నట్లు తెలుపగా, ఆటోలకు చాలా వ్యయం అవుతుంది, మోపెడ్ ఇస్తే నేర్చుకుంటావా అని ముఖ్యమంత్రి ప్రశ్నించి, ఈమెకు ఇంట్లోనే చార్జి పెట్టుకునే ఎలక్ట్రిక్ టూవీలర్ అందించాలని ముఖ్యమంత్రి కలెక్టర్ ను ఆదేశించారు.
అంగడి లో పనిచేస్తూ ముగ్గురు ఆడపిల్లలను చదివించుకుంటున్న వాసంశెట్టి విజయలక్ష్మి కి, చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదిశేషుకు కూడా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆర్థిక సహాయం అందించి, మెరుగైన ఉపాధి పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం, ముఖ్యమంత్రి అన్న క్యాంటీన్ పున ప్రారంభం గొప్ప కార్యక్రమమని అభివర్ణిస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, డైరెక్టర్ హరి నారాయణన్, CMO కార్యదర్శి ప్రద్యుమ్న , హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ సీఈవో కౌంతేయ దాస, పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగ నరసింహారావు, గుడివాడ ఆర్టీవో పద్మావతి మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.