Breaking News

త్యాగధనులు, మహనీయుల ఆశయాల బాటలో పయనిద్దాం

-దేశాభివృద్ధికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం
-వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు
-రాజమహేంద్రవరం  పర్యాటకంగా  మరింత అభివృద్ధి చేస్తాం
-ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడిన ప్రభుత్వం
-78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ పతాకావిష్కరణ చేస్తూ మంత్రి దుర్గేష్
వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డి నరసింహా కిషోర్, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామ కృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్. చిన రాముడు, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎందరో మహనీయులు, దేశ భక్తులు తమ వీరోచిత పోరాటాలు, నిస్వార్థ త్యాగాలతో  స్వేచ్ఛాభారతావనిని మనకు అందించారని,  వారందరి త్యాగాలను స్మరించుకోవాలని  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖామంత్రి  కందుల దుర్గేష్ వారికి అంజలి ఘటించారు.  వారి ఆశయాల బాటలో కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా దేశాభివృద్ధికి, రాష్ట్ర సర్వతోముఖా భివృద్ధికి పునరంకితమవుదామని ఆయన పిలుపు నిచ్చారు.

78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆర్ట్స్ కాలేజి లో గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన   జిల్లా మంత్రి, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కి  జిల్లా కలెక్టర్ పి  ప్రశాంతి ఎస్పీ డి నరసింహ కిషోర్ లు స్వాగతం పలికారు. ఈసందర్బంగా  జాతీయ పతాకాన్ని  మంత్రి దుర్గేష్ ఆవిష్కరించి, పోలీసుల  నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ ను పరిశీలించారు.

ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ జిల్లా ప్రగతిపై సందేశం ఇస్తూ, ముందుగా 78వ స్వాతంత్ర్య వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార ప్రముఖులు, జిల్లా ప్రజలందరికీ  హృదయ పూర్వక స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

పరిపాలనాధక్షుడు, విజన్ 2047 మార్గనిర్దేశకులు రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తోందన్నారు. . దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నాం. స్వాతంత్రోద్యమంలో తూర్పు గోదావరి జిల్లా నుండి ఎందరో ప్రముఖులు చురుకుగా పాల్గొన్నారని ఆయన గుర్తుచేస్తూ,  అటువంటి వారిని స్ఫూర్తిగా “ఆజాది కా అమృత మహెూత్సవ్”ను పురస్కరించుకొని జిల్లాలో ఆగస్టు 9 నుంచి ఈ రోజు వరకు స్వాతంత్య్ర స్ఫూర్తినిచ్చే అనేక కార్యక్రమాలను నిర్వహించుకున్నామని, హర్ ఘర్ తిరంగా వంటి విన్నూత్న కార్యక్రమాలతో జాతీయ స్ఫూర్తిని పెంపొందించేలా వాడవాడలా పలు కార్యక్రమాలను చేపట్టి స్వాతంత్య్ర సమరయోధులకు ఘనంగా నివాళులర్పించామని ఆయన గుర్తుచేశారు.

మహాత్మగాంధి కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి నింపేలా మైనర్, మేజర్ పంచాయితీలకు 10 వేలు, 20 వేలు నిధులు ఖర్చుచేసి ఘనంగా వేడుకలను నిర్వహించు కుంటున్నామని గుర్తుచేశారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతూ, అందులో తూర్పు గోదావరి జిల్లాను భాగస్వామ్యం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజా ఆశీస్సులతో ప్రజాప్రతినిధుల సభలో 93 శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజల నమ్మకానికి న్యాయం చేసే దిశలో సంక్షేమం, అభివృద్ధి సమపాళల్లో ప్రజలకు చేరువ చేద్దామని మంత్రి దుర్గేష్ అన్నారు.
ఎన్నికలలో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అర్హులకు అందించేందుకు కట్టుబడిఉన్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు 20 లక్షల వరకు ఉపాధి అవకాశాలు, 3 వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి, పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 15 వేల రూపాయలు ఆర్థిక తోడ్పాటు, ప్రతి ఏటా రైతుకు అన్నదాత పథకం ద్వారా రూ.20 వేలు ఆర్థిక సహాయం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహాశక్తి పథకం క్రింద ప్రతి మహిళకు 1500 రూపాయలు ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.  భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను చేపట్టనున్నామన్నారు.

సామాజిక భద్రత ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు హామీ మేరకు తొలి నెలలోనే 4 వేల రూపాయలు పెన్షన్ లబ్దిదారుల ఇంటివద్దనే తొలిరోజే 98 శాతం మందికి అందించామని,  హామీ మేరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు వెయ్యి చొప్పున ఉన్న బకాయిలు 3 వేల రూపాయలతో కలిపి జూలై మాసంలో 7 వేల రూపాయలను లబ్దిదారులకు అందించామని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. నేటి నుంచి పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను ప్రారంభించుకుంటున్నామన్నారు. జిల్లాలో ఐదు అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయన్నారు.
అన్నార్తుల ఆకలి తీర్చిన అన్నపూర్ణగా నిలిచిన డొక్కా సీతమ్మ స్ఫూర్తి భావితరాలకు అందించే క్రమంలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టామని ఆయన తెలిపారు.

చారిత్రాత్మక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన నగరంగా జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరాన్ని పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. సాంస్కృతిక రాజధానిగా రాష్ట్రంలోనే రాజమహేంద్రవరం విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ఆదికవి నన్నయ్య, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం, దుర్గాబాయ్ దేశ్ ముఖ్, ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, గరిమెళ్ళ సత్యనారాయణ వంటి మరెందరో స్వాతంత్ర్య సమరయోధులు, సాహితీ వేత్తలకు పురుటిగడ్డ ఈ ప్రాంతమని ఆయన ఉద్ఘాటించారు.

రాజమహేంద్రవరంలో విద్యాభ్యాసం చేసిన మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 1904లో అతిపిన్న వయస్సులోనే మునిసిపల్ చైర్మన్ పనిచేసి తదుపరి రోజుల్లో రాష్ట్రానికి ప్రధమ ముఖ్యమంత్రి అయ్యారని,  ధవళేశ్వరం బ్యారేజ్ సృష్టికర్త, ఉభయగోదావరి జిల్లాల ఆరాధ్యుడు సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడని,  విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు తిరుగాడిన ప్రదేశమిదని మంత్రి దుర్గేష్ స్మరించుకున్నారు. మన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించే దిశలో మనందరి సమష్టి భాగస్వామ్యంతో అగ్రగామిగా నిలుపుదాం. 2027 గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇకో టూరిజం, కడియం నర్సరీలను ప్రత్యేక పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అభివృద్ధికి ప్రణాళికలను సిద్దం చేస్తున్నామని,  ప్రజా సమస్యల పరిష్కార వేదిక “మీకోసం” ద్వారా ప్రజాసమస్యలకు సత్వర పరిష్కారాన్ని అందించే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.  ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలను మరింత చేరువ చేయడానికి వీలుగా రాజమహేంద్రవరం కేంద్రంగా జిల్లా కలెక్టరు, ఎస్పీ, ఇతర అధికారులు జిల్లా అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తూ అడుగులు వేస్తున్నామని ఆయన చెబుతూ,  ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తామన్నారు.

అపార అనుభవం, పరిపాలనాధక్షత ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా విజన్ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లుగా భావించి సంక్షేమ పాలన దిశగా అమరావతి రాజధానిగా పాలన సాగిస్తున్నామని ఆయన తెలిపారు.  జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈసందర్బంగా ఆయన ప్రస్తావించారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, జలవనరుల శాఖ, విద్యాశాఖ, రెవెన్యూ , వైద్య ఆరోగ్య,  మత్య్సశాఖ, పశు సంవర్ధక శాఖ, ఆర్ అండ్ బి, గృహనిర్మాణం, గ్రామీణ నీటి సరఫరా, పౌర సరఫరాలు, విద్యుత్, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పధకం, పంచాయితీ రాజ్, మున్సిపల్, పరిశ్రమలు, శాంతి భద్రతలు, క్రీడలు, రాజామహేంద్రవరం నగరాభివృద్ధి,  అలాగే డి ఆర్ డి ఏ, ఐసిడిఎస్, నైపుణ్యాభివృద్ధి తదితర రంగాల్లో అభివృద్ధిని మంత్రి దుర్గేష్ వివరించారు. అన్ని రంగాల్లో జిల్లాను ప్రగతి పథంలో ముందుకు సాగడానికి అందరి భాగస్వామ్యంతో అవరోధాలు అధిగమిస్తూ, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుతూనూ, వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా ముందడుగు వేద్దామని ఆయన పిలుపు నిచ్చారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *