Breaking News

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు

-పోలీసు శాఖను పటిష్ట పర్చేందుకు సిఎం సమీక్షలో పలు నిర్ణయాలు
-రాష్ట్ర హోమ్ & విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్లో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అద్యక్షతన హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో నేడు సమీక్షా సమావేశం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్ శాఖ పటిష్టతతోపాటు రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించే విధంగా పలు చర్యలు చేపట్టే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలను, అనుమతులను జారీచేయడం జరిగిందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి ఆ వ్యవస్థకు అవసరమైన కనీస సదుపాయాలను, వసతులను కూడా కల్పించకపోవడం జరిగిందన్నారు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ బిల్లులు చెల్లించకపోవడం, సిసి కెమేరాలు పనిచేయకపోవడం, మోడరనైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ క్రింద కేంద్ర నిధులు సక్రమంగా సద్వినియోగం చేసుకోకపోవడం, క్షేత్ర స్థాయిలో పోలీసులకు వాహన సదుపాయాలు కల్పించకపోవడం, వాహనాల ప్యూయల్ను కూడా సక్రమంగా ఇవ్వక పోవడం, పోలీస్ స్టేషన్ల నిర్వహణ నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల పోలీస్ వ్యవస్థం పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయి రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తడం జరిగిందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద కనీసం ఆరు సి.సి. కెమేరాలు పెట్టాల్సి ఉందని, అయితే వాటి బిల్లులను కూడా గత ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ఈ సమస్యలను అన్నింటినీ తక్షణమే అదికమించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు, వసతులు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద కనీసం ఆరు సి.సి. కెమేరాలు పెట్టేందుకు అవసరమైన రూ.11 కోట్లను వెంటనే క్లియర్ చేయమని సిఎం ఆదేశించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేల సిసి కెమేరాల్లో ఏవి పనిచేస్తున్నాయో పది రోజుల్లో గుర్తించాలని, మరెక్కడ సిసి కెమేరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్న గుర్తించాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ పెండింగ్ బిల్లుల బకాయిలు రూ.10 కోట్లు కూడా వెంటనే చెల్లించాలని సిఎం ఆదేశించారన్నారు. క్షేత్ర స్థాయిలో పోలీసుల పర్యటనకు అవసరమైన వాహనాలను ఇంకా ఎన్ని సమకూర్చాల్చి ఉందో వెంటనే గుర్తిస్తే వాటిని కూడా సాద్యమైనంత త్వరగా సమకూర్చుతామని సిఎం అన్నారని ఆమె తెలిపారు. ప్రతి వాహనానికి ప్రస్తుతం ఇస్తున్న నెలవారీ 150 లీటర్ల ఆయిల్ ను 300 లీటర్ల పెంచేందుకు సిఎం అంగీకరించారన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు ప్రాంతాలను గుర్తించి, దాని నిర్మూలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు డ్రోన్ల సహాయాన్ని పొందాలని సిఎం ఆదేశించారన్నారు. గంజాయి నిర్మూలకు నార్కొటిక్ టాస్క్ ఫోర్సు ను ఏర్పాటు చేస్తున్నామని, ప్రస్తుతం ఫైనాన్సు డిపార్టుమెంట్ లో ఆ ప్రతిపాదనలు ఉన్నాయని, త్వరలో ఈ విషయంలో క్యాబినెట్ ఆమోదం పొందడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు 26 జిల్లాలో గంజాయి దుష్పరిణామాలపై అగాహనా ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.

దేశంలో సైబర్ క్రైమ్ కేసులు విస్తృత స్థాయిలో నమోదు అవుతున్నాయని, ఏడాది కాలంలో దాదాపు రూ.940 కోట్ల మేర నష్టపోవడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో డిఎస్పీ స్థాయి అధికారితో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. విజయవాడలో పోలీస్ అకాడమీ ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారన్నారు. విశాఖపట్నంలో రూ.290 కోట్లతో గ్రే హౌండ్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ఆమె తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ప్రతి పోలీస్ స్టేషన్కు ఇన్వెస్టిగేషన్ చార్జీలు గా రూ.8 వేలు ఇచ్చేవారన్నారు. అయితే గత ప్రభుత్వం ఆ చార్జీలను కూడా నిలుపుదల చేసిందన్నారు. తిరిగి ఆ చార్జీలను ఇచ్చేందుకు సిఎం ఆమోదం తెలిపారని, అయితే ఇప్పడు ఎంత ఇవ్వాలో నిర్ణయించాలని సూచించినట్లు ఆమె తెలిపారు. గతంలో తమ ప్రభుత్వం అమరావతిలో దాదాపు రూ.49 కోట్లతో ప్రారంభించిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణాన్ని కూడా గత ప్రభుత్వం నిలుపుదల చేసిందన్నారు. అయితే ఆ ల్యాబ్ ను యూనివర్శిటీగా మార్పు చేస్తూ దాని నిర్మాణాన్ని కొనసాగించాలని సిఎం ఆదేశించినట్లు ఆమె తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించిన విధంగా త్వరలో తగు చర్యలు తీసుకోనున్న మంత్రి తెలిపారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *