-జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి
-బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోవడం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అనే సమాచారం పై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన, బాధితులకు అందుతున్న సాయంపై ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో 7 గురు చనిపోగా… 30 మందికిపైగా తీవ్రంగా గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చికిత్స పొందుతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉన్నతాధికారులను, పరిశ్రమల శాఖ అధికారులను అక్కడే ఉండి పూర్తి స్థాయి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అదేశించారు.