Breaking News

విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠ్యపుస్తకాలు సిద్ధం కావాలి!

-అనకాపల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు
-నవంబర్ లో మెగా పేరెంట్–టీచర్ సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి
-ఏ స్థాయిలో ప్రశ్నాపత్రాలు లీకైనా కఠిన చర్యలు తీసుకుంటాం
-పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అనకాపల్లి అనాధ శరణాలయంలో కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటనపై మంత్రి విచారం వ్యక్తంచేస్తూ ఆ సంఘటన పూర్వాపరాలపై ఆరా తీశారు. భవిష్యత్తులో మరోమారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏజన్సీ స్కూళ్లతో పాటు ప్రైవేట్ వ్యక్తులు నడిపే ఆశ్రమాలు కూడా నిరంతరం ట్రాక్ చేస్తూ పర్యవేక్షించాలన్నారు. పాఠశాలల్లో ఇంటర్నల్, ఎక్సటర్నల్ ప్రశ్నాపత్రాలు ఏ స్థాయిలో లీకైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా సిబిఎస్ఇ సిలబస్ అమలవుతున్న వెయ్యి పాఠశాలల్లో అసెస్ మెంట్ టెస్ట్ కొనసాగుతోందని, ఇందుకు సంబంధించిన ఫలితాలు వచ్చాక విధాన పరమైన నిర్ణయాలు తీసుకుందాం అని అన్నారు. మండలస్థాయిలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చిందని, ఆ తర్వాత డివిజన్ స్థాయిలో చేపడతామని అన్నారు. సర్దుబాటు ప్రక్రియలో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 5 న గురుపూజోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని, ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించాలని లోకేష్ అన్నారు. నవంబర్ లో మెగా పేరెంట్ – టీచర్స్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సైన్స్ ఫేర్, స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించాలని, విద్యార్థుల్లో క్రీడానైపుణ్యాలను పెంపొందించేందుకు అవసరమైన స్పోర్ట్స్ కిట్స్ అందజేయాలన్నారు. పాఠశాల విద్య శాఖను పట్టిపీడిస్తున్న కోర్టు వివాదాల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాలల్లో పారిశుద్ధ నిర్వహణకు సంబంధించిన యాప్ ల భారాన్ని టీచర్లకు తప్పించినట్లు చెప్పారు. గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించామని, స్కూలు మేనేజ్ మెంట్ కమిటీలు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యి పర్యవేక్షణ చెయ్యాలని అన్నారు. పాఠశాలల్లో ఆయాలు, వాచ్ మెన్లకు పెండింగ్ లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లెర్నింగ్స్ అవుట్ కమ్స్ పై సమీక్షిస్తూ విద్యా సామర్థ్యాల మెరుగుదలకు పకడ్బందీగా శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్ పదోన్నతులు, పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులపై సుదీర్ఘంగా చర్చించారు. సాధ్యమైనంత త్వరగా కేసుల పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, డైరక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *