– సహకార శాఖ విశాఖ జిల్లా అధికారిణి ప్రవీణ
– సామాన్య మధ్యతరగతి వర్గాలకూ రుణ సదుపాయం
– బ్యాంకు చైర్మన్ వేమూరి వెంకట్రావు
– విశాఖలో గాంధీ అర్బన్ బ్యాంక్ శాఖ ప్రారంభం
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సహకార రంగంలో అర్బన్ బ్యాంకుల పాత్ర, సేవలు అమోఘమైనవని విశాఖ జిల్లా సహకార శాఖాధికారి టి.ప్రవీణ ప్రస్తుతించారు. ప్రధానంగా వ్యాపారాలు, గృహ నిర్మాణాలకే కాకుండా అత్యవసర సమయాల్లోనూ ప్రజలకు ఈ బ్యాంకులు అండగా నిలుస్తున్నాయని ఆమె అన్నారు. విజయవాడ ప్రధాన కేంద్రంగా గత 97 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుస్తున్న ‘ది గాంధి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ – (జిసియుబి)’ విశాఖపట్నంలోని న్యూ గాజువాకలో ఏర్పాటు చేసిన తొలి శాఖను ఈ నెల 22న ఉదయం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రవీణ మాట్లాడుతూ.. బ్యాంకు పాలకవర్గం, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
బ్యాంకు చైర్మన్ వేమూరి వెంకట్రావు (చిన్ని) మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ బ్యాంకు 1200 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలతో దినదినాభివృద్ధి చెందుతోందని చెప్పారు. తొలుత 15వేల రూపాయలతో ప్రారంభమైన రుణాలను దశలవారీగా పెంచుకుంటూ చిన్న, మధ్యతరగతి వ్యాపారస్తులకు సైతం ప్రస్తుతం 2కోట్ల రూపాయల వరకు రుణాలిచ్చే స్థాయికి బ్యాంకు ఎదిగిందని తెలిపారు. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు మరింతగా సహాయపడే వుద్దేశంతో తక్షణ రుణ సదుపాయం రూ.2లక్షలు ఇస్తున్నామని, అయితే అవసరాన్ని బట్టి ఈ మొత్తాన్ని పెంచుతామన్నారు. రూ.20లక్షల వరకు విద్యా రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణం, కొనుగోలుకు రూ.60లక్షల వరకు రుణ సదుపా యం తమ బ్యాంకులో లభిస్తుందని ఆయన చెప్పారు.
బ్యాంకు వైస్ చైర్మన్ అబ్దుల్ ఖయ్యూం అన్సారి మాట్లాడుతూ.. తమ బ్యాంకుకు రెండు శాశ్వత భవనాలు వున్నాయని, 105 మంది సిబ్బంది 25వేల మంది సభ్యులు, ఖాతాదారులకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. విస్తారమైన విశాఖపట్నం నగరంలో మరో 10 శాఖల వరకు ప్రారంభించాలనేది తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. బ్యాంకు శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా శాస్త్రబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తంగా బ్యాంకుకు ఇది 13వ శాఖ కావటం విశేషం.
ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు సగ్గుర్తి నాగేశ్వరరావు, కోగంటి వెంకట్రామయ్య, శభాష్ తేజ, సుంకర కిషోర్ బాబు, బ్రాంచి మేనేజర్ మురళి పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయుడు నిమ్మరాజు చలపతిరావు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.