మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ డాక్యుమెంట్ తయారీకి సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ 2047 డాక్యుమెంట్ తయారీపై జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 జిల్లా డాక్యుమెంట్ తయారు చేసి పంపాలని ఆదేశించిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 78 వేల కోట్ల రూపాయల ఉత్పత్తి ఉందని దీన్ని మరో 15 శాతానికి పెంచి ఆదాయం పెంచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందుకోసం ఉత్పత్తులు వాటి ధరల పెరుగుదలకు వినూత్నంగా ఆలోచించాలన్నారు. ఈ నెల 27వ తేదీ మంగళవారం మండల స్థాయిలో డాక్యుమెంట్ తయారీపై కార్యశాల నిర్వహించాలన్నారు. ఇందులో ప్రతి ప్రభుత్వ శాఖకు చెందిన అధికారులతో పాటు రైతులు, ప్రజాప్రతినిధులను, రైతు సంఘాలు, చేనేత సహకార సంఘాలు, మత్స్య సహకార సంఘాలు తదితర సంఘాల ప్రతినిధులను భాగస్వాములు చేసి వారి నుండి సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య , చేనేత తదితర శాఖల ఉత్పత్తులు, వాటి విలువలు పెరిగేందుకు తద్వారా రైతులకు ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న పంటలు, ఆక్వా కల్చర్ లలో పరిమాణము, నాణ్యత, విలువలు పెంచడానికి ఏఏ అవకాశాలు ఉన్నాయో వాటిని గుర్తించాలన్నారు. సంవత్సరం అంతా పంటలు వేసే విధంగా, అంతర పంటలు వేసే విధంగా రైతులను ప్రోత్సహించి వారి ఆదాయం పెంచే మార్గాలను గుర్తించాలన్నారు.
అంతేకాకుండా గ్రామాల్లో ఉండే యువతకు ఏదైనా నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తే ఉత్పత్తుల్లో గాని ధరలో గాని మరింత మెరుగుదలయ్యే అవకాశాలను కూడా గుర్తించాలన్నారు. మండలాల్లో ఆర్థికపరమైన కార్యకలాపాలు ఏమి జరుగుతున్నాయో ఒకసారి దృష్టి సారించి అవి ఎంతవరకు ఉత్పత్తులు, వాటి ధరలు పెరుగుదలకు ఉపయోగపడతాయి గమనించాలన్నారు. గ్రామాల్లో కొందరు రైతులు వినూత్నంగా పంటలు పండించి అధిక దిగుబడులు సాధిస్తుంటారని, అటువంటి వారిని వెలికితీసి ఇతర రైతులకు కూడా అటువంటి పద్ధతులను నేర్పించే లాగా కృషి చేయాల్సి ఉంటుందన్నారు. మండలాల నుంచి సమాచారాన్ని నిర్ణీత నమూనాలో పంపాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో తాను పర్యటించి అక్కడి రైతులు ప్రజాప్రతినిధులతో స్వయంగా మాట్లాడుతానన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ తదితర కార్పొరేషన్ల ద్వారా పేద ప్రజలకు జీవనోపాదులు కల్పించి తద్వారా వారి ఆదాయం పెంచే మార్గాలను కూడా అన్వేషించాలన్నారు
ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఇన్చార్జి డిఆర్ఓ శ్రీదేవి ,సి పి ఓ గణేష్, డి ఆర్ డి ఎ పి డి నాగేశ్వర్ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి వెంకట్రావు, ఏపీఐఐసీ జడ్ ఎం సీతారామయ్య, బీసీ సంక్షేమ అధికారి రమేష్, ఐసిడిఎస్ పిడి సువర్ణ, డీఎంహెచ్వో డాక్టర్ గీతాబాయి తదితర జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దారులు, ఎంపీడీవోలు తదితర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.