-ప్రకృతిని రక్షించాలని మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ప్రభావవంతంగా మరియు చైతన్యవంతం చేయడంలో చురుకుగా సహకరించాలని పిలుపునిచ్చిన అదనపు డైరెక్టర్ జనరల్, రాజిందర్ చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్టు 15, 2024న 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని విజయవాడ పత్రికా సమాచార కార్యాలయం ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరు మీద ఒక చెట్టు నాటడం) ప్రచారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెంచడం కోసం ఉద్దేశించిన ఈ డ్రైవ్ మార్చి 2025 వరకు కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 5, 2024న పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారాన్ని ప్రారంభించి, భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిఒక్కరూ వారి తల్లికి ప్రశంసగా ఒక చెట్టుని నాటాలని కోరారు.
పత్రికా సమాచార కార్యాలయం మరియు కేంద్ర సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ (ఆంధ్రా ప్రాంతం) రాజిందర్ చౌదరి ఈ ప్రచారంలో పాల్గొని ఒక మొక్కని నాటారు. పత్రికా సమాచార కార్యాలయం మరియు కేంద్ర సమాచార కార్యాలయం అధికారులు మరియు సిబ్బంది ప్రకృతిని రక్షించే నిమిత్తం మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ప్రభావవంతంగా మరియు చైతన్యవంతం చేయడంలో చురుగ్గా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ చిన్న పని వాతావరణ మార్పులతో పోరాడేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు మరియు మన పరిసరాలను పచ్చగా మార్చేందుకు బాగా సహాయపడుతుందని ఆయన అన్నారు. ప్రతిఒక్కరూ ఈ ప్రచారంలో పాల్గొనాలని మరియు తాము చెట్లు నాటే కథనాలను సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా దీన్ని పెద్ద ఉద్యమంగా మార్చాలని చౌదరి కోరారు.