-ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి
-సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు
-మిజోరం గవర్నర్ కంభంపాటిని కలిసి సత్కారం
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఓవైపు సోషల్ మీడియా దూసుకెళ్తుండగా, మరోవైపు సమస్యలతో పత్రికా రంగం కునారిల్లుతోందని, ప్రభుత్వాలే సహకరించి ఆదుకోవాలని సీనియర్ జర్నలిస్ట్, ఎపియుడబ్ల్యుజె ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి (1990-2001) నిమ్మరాజు చలపతిరావు కోరారు. రాజ్యాంగంలో నాలుగో స్తంభమైన పత్రికా రంగ పూర్వవైభవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనిచ్చేలా సహకరించాలని మిజోరం గవర్నర్ డా. కంభంపాటి హరిబాబుకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన విశాఖలో డా. కంభంపాటిని మర్యాదపూర్వకంగా కలిశారు. టెలికాం రంగానికి మహర్దశ, దేశాభివృద్ధిలో మీడియా పాత్ర, తదితర అంశాలు వీరి మధ్య ప్రస్తావనకు వచ్చాయి.
డా. కంభంపాటి స్వగ్రామం ప్రకాశం జిల్లా తిమ్మసముద్రంలోని శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాలలో ఐదేళ్లు భాషా ప్రవీణ కోర్సు చదవటం తన అదృష్టమని నిమ్మరాజు అన్నారు. ఆపై హైదరాబాదులో ఏడాది పాటు తెలుగు పండిట్ కోర్సు పూర్తి చేసి, ఆంధ్రపత్రికలో తెనాలి విలేకరిగా చేరినట్లు గుర్తుచేసుకున్నారు. తరువాత ఉలవపాడు సమితి మొగిలిచర్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఆంధ్రపత్రిక ప్రకాశం జిల్లా ప్రత్యేక ప్రతినిధిగా వుంటూనే 18 నెలల పాటు పనిచేసినట్లు తెలిపారు. జర్నలిజంపై మక్కువతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, గుంటూరులో బ్యూరో చీఫ్ గా చేరినట్లు గుర్తుచేశారు. జర్నలిజానికే తన జీవితం అంకితమని నిమ్మరాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు.