పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలాంటి పరిస్థితి నైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని, అధైర్య పడవద్దని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బాధితులకు భరోసా కల్పించారు. జిల్లా కలెక్టర్ సోమవారం జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తో కలిసి పెనమలూరు మండలం పెద్దపులిపాక, యనమలకుదురు కరకట్ట మీద పర్యటించి వరద నీటిలో మునిగిన ప్రాంతాలు, ఇళ్ళు పరిశీలించారు. పెదపులిపాక గ్రామ పరిధిలో నీట మునిగిన ఎన్టీఆర్ కాలనీలో ఇంకా కొంతమంది లోపలే ఉన్నారని తెలుపగా, వారిని పడవల ద్వారా బయటకు తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు , అధైర్య పడవద్దని కాలనీ వాసులకు కలెక్టర్ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరద బాధితులు కలెక్టర్ ను కలిసి తమ సమస్యలు తెలియజేశారు. కట్టుబట్టలతో ఇల్లు వదిలి బయటకు రావలసిన పరిస్థితి ఏర్పడిందని, తమ పిల్లల పుస్తకాలు వరద నీటితో తడిచి పాడయ్యాయని, మరల పుస్తకాలు అందించాలని కోరారు. కొంతమంది తమ పిల్లల సర్టిఫికెట్లు కోల్పోయామని చెప్పారు. వరద తగ్గగానే జరిగిన నష్టం అంచనా వేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు తగిన సహాయం అందించుటకు చర్యలు తీసుకుంటామన్నారు.
వరదలకు ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. పెదపులిపాకల గ్రామంలో మండల పరిషత్ స్కూల్లో వరద బాధితులకు ఏర్పాటుచేసిన సహాయపునరావాస కేంద్రాన్ని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సందర్శించి బాధితులతో మాట్లాడి వారికి అందిస్తున్న ఆహారం వసతులు గురించి ఆరా తీశారు. మెడికల్ క్యాంపు పరిశీలించారు. బాధితులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులకు సూచించారు. సర్పంచ్ గుంటూరు శ్రీనివాసరావు, ఉయ్యూరు ఆర్డిఓ డి రాజు, పెనమలూరు తాసిల్దారు గోపాలకృష్ణ, సంబంధిత అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.