-నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరద ముంపునకు గురైన ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు కేంద్రం ఇతోధికంగా సాయం అందించాలని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ కోరారు. వరద ముంపు ప్రాంతాల్లో భారీగా ఆస్తినష్టం, పంట నష్టం జరిగిందని, కేంద్రం తక్షణ సాయం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, తారకరామానగర్ వాసులకు రాణీగారితోటలోని రామాలయం కమ్యూనిటీ హాల్‌లో, ఒడిబి కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను జమీల్ అహ్మద్ బేగ్ సందర్శించారు. పునరావాస కేంద్రంలో ఉన్న వారిని పరామర్శించి, యోగక్షేమాలు, ఆస్తినష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే గుంటూరు జిల్లా పెదకాకాని ఎంపీపీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో తిరుగుతూ వరద బాధితులకు అండగా నిలబడడాన్ని, సత్వర సహాయ సహకారాలు అందిచడాన్ని అభినందించారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. వరద ముంపుతో వరి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు చొపðన ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించాలని, మిగతా వాణిజ్య పంటలకు, వరదల్లో ఇళ్లు, ఆస్తులు నష్టపోయిన వారికి తగు పరిహారాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తమ పార్టీ తరఫున కోరుతున్నట్లు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ తెలిపారు.