– వేలాది మందికి ఆహారం, తాగునీరు సరఫరా
– ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తాం
– ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సీఎండీ నాగ భాస్కరరావు మానికొండ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓ వైపు మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత భారీ వర్షాలు.. మరో వైపు విరుచుకుపడిన వరద ప్రభావంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. ఈ ఘోర విపత్తు సమయంలో ఆపదలో ఉన్న వారికి సాయమందించేందుకు ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సంస్థ ముందుకు వచ్చింది. వ్యాపార రంగంలోనే కాకుండా, అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలందుకున్న ఈ సంస్థ.. తాజా వరదల నేపథ్యంలో, వేలాది మంది బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తూ సేవాభావాన్ని చాటుకుంటోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సంస్థ, విజయవాడ అర్బన్ రాజీవనగర్ , కండ్రిక , ఉడా కాలని లో మంగళవారం నాడు ఆహారం, తాగునీటి పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సీఎండీ నాగ భాస్కరరావు మానికొండ సారథ్యంలో, ఆ సంస్థ ప్రతినిధులు మరియు మంగళాపురం గ్రామస్థులు బాధితుల చెంతకు వెళ్లి ఆహారమందించి భరోసానిచ్చారు. ఉడా కాలాని తో పాటు, నగర శివారు ప్రాంతాల్లోని సుమారు 2,500 మందికి ఆహారం, తాగునీటిని అందజేశారు. గత రెండు రోజులుగా దాదాపు 5000 వేల మందికి ఆహారం, సురక్షిత తాగునీటిని పంపిణీ చేశారు. ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సీఎండీ నాగ భాస్కరరావు మానికొండ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు సేవలందించడంలో తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. వరద ఉధృతిలో చిక్కుకున్న వారికి సాయమందించి, అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు రోజుల్లో అయోధ్యనగర్, గవర్నమెంట్ ప్రెస్, సింగ్ నగర్ వైపు ముంపు బాధితులకు ఆహారం అందజేసినట్లు నాగ భాస్కరరావు మానికొండ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ మార్కెటింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.