-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 10వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ” పొలం పిలుస్తోంది” అనే కార్యక్రమం నిర్వహించబడుతుందని, జిల్లాలోని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ గారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు తదితర సంబంధిత అధికారులతో కలిసి “పొలం పిలుస్తోంది” కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పొలం పిలుస్తోంది అనే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఉపయోగార్ధం చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఈ వ్యవసాయ విస్తరణ కార్యక్రమం అని, రైతులకు నూతన సాంకేతిక పద్ధతులను తెలిపి, వారికి సంబంధించిన పొలాల సంరక్షణ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడి వచ్చే విధంగా చేపట్టాల్సిన మెలకువలపై వారికి సూచనలు సలహాలు ఇవ్వడం అని, వారి సమస్యలను తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకునే వేదిక ఈ పొలం పిలుస్తోంది అనే కార్యక్రమమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వ్యవసాయ శాఖ తో పాటు అనుబంధ శాఖలైన ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ, షుగర్ కేన్, మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాస్త్ర వేత్తలు, వ్యవసాయ నిపుణులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి వారంలో మంగళ, బుధవారం రోజులలో మాత్రమే ఉంటుందని ఉదయం క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలించి అనంతరం ఒకచోట రైతులతో కలిసి కూచుని పొలంలో పరిశీలించిన అంశాలపై రైతులతో చర్చించి సలహాలు సూచనలు ఇవ్వడం జరగాలని, సమస్యల సత్వర పరిష్కారం కొరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే మధ్యాహ్నం మరొక గ్రామంలో క్షేత్ర స్థాయిలో పొలాలను సదరు శాఖలు పరిశీలన చేసి రైతులతో సమావేశమై చర్చించడం జరుగుతుందని ఇలా వారంలో నాలుగు గ్రామాలు కవర్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని రైతులకు ముందస్తు సమాచారం అందించి రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ గోడ పత్రిక విడుదల కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ధనుంజయ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.