మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరదల విపత్తును జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను, ఆస్తులను కాపాడారని మచిలీపట్నం ఆంధ్ర ప్రదేశ్ యోగాసభ యోగా గురువులు గుర్నాథ్ బాబు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని నడక మిత్ర మండలి భవనంలో ఆంధ్రప్రదేశ్ యోగ సభ మచిలీపట్నం ఆధ్వర్యంలో యోగ సభ్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దంపతులను, ప్రభుత్వ అధికారులను ఘనంగా సన్మానించారు. తొలుత యోగ గురువు గురునాధబాబు కలెక్టర్ దంపతులను దుశ్శాలువతో సన్మానించారు. సీనియర్ జర్నలిస్టు ముదిగొండ శాస్త్రి పుష్పగుచ్చం తో అభినందించారు. ఈ సందర్భంగా యోగా గురువులు గురునాథ బాబు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నిరంతరం శ్రమించి అధికారులందరినీ అప్రమత్తం చేస్తూ ఎలాంటి ప్రమాదాలు ప్రాణ నష్టం జరగకుండా అహర్నిశలు కృషి చేశారన్నారు. విధినిర్వహణలో అకుంఠిత దీక్షతో ప్రజలకు విశేష సేవలు అందించారన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి పునరావాస కేంద్రాల్లో మూడు పూటలా ఆహారము, మంచినీరు ఇతర సదుపాయాలు కల్పించి అన్ని విధాల ఆదుకున్నారన్నారు.
విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిడిలు ఉన్న తట్టుకొని యోగ సాధనకు క్రమం తప్పకుండా వస్తున్న జిల్లా కలెక్టర్కు భగవంతుడు మంచి ఆరోగ్యంతో పాటు మరింత శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నామన్నారు.
అనంతరం యోగ సభ్యులందరూ కరతాళ ధ్వనులతో కలెక్టర్ దంపతులను అభినందించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా పడిపోయిన విద్యుత్ స్తంభాలను, దెబ్బతిన్న సబ్ స్టేషన్లు, ఫీడర్లను ఎప్పటికప్పుడు పునరుద్ధరించి విద్యుత్ సరఫరాకు లోటు లేకుండా అవిశ్రాంతంగా కృషి చేసిన విద్యుత్ శాఖ ఈ ఈ భాస్కర్ రావును కలెక్టర్తో పాటు యోగ సభ్యులు ప్రశంసించారు. కలెక్టర్ డికె బాలాజీ, యోగా గురువులు, గురునాధబాబు, ముదిగొండ శాస్త్రి యోగా సభ్యులు అందరూ కలిసి సన్మానించారు.
అదే విధంగా జిల్లాలో వర్షాలు వరదలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రసారమాధ్యమాలకు అందజేస్తూ తన వంతు కృషి చేస్తున్న జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి యమ్. వెంకటేశ్వర ప్రసాద్ ను కూడా కలెక్టర్ డికె బాలాజి, నడక సంఘం ట్రస్టి జగన్ మోహన్ రావు, యోగా గురువు, సభ్యులు సన్మానించారు.
తదుపరి నడక మిత్రమండలి భవనం వాచ్మెన్ దత్తపుత్రిక జ్యోతిక వివాహ సందర్భంగా ఆమెకు యోగా సభ సభ్యుల సౌజన్యంతో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించారు.