అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితుల కోసం విద్యుత్ శాఖ ఉద్యోగులు భారీ విరాళాన్ని ప్రకటించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ నేతృత్వంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒకరోజు జీతాన్ని విరాళం గా ఇచ్చారు. ఈ మొత్తం రూ. 10,61,81,614 లను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.
ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… వరద బాధితులను ఆదుకోవడానికి విద్యుత్ ఉద్యోగులు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. వారి ఒకరోజు జీతాన్ని రూ. 10,61,81,614 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. గత పది రోజులుగా విజయవాడ నగరంలో వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తూ బాధితులకు అండగా నిలబడుతూ పెద్దఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడారు. 70 ఏళ్లకు పైబడినా కూడా సీఎం రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి అందిస్తున్న సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పని చేస్తూ తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు సమిష్టి కృషి కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో 3-4 లక్షల విద్యుత్ కనెక్షన్ల పునరుద్ధరణ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ మాట్లాడుతూ… విద్యుత్ శాఖ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు కూడా ముందుంటారని తెలిపారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేస్తారని అన్నారు. ఇప్పుడు కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, ఏపీ ట్రాన్స్కో జేఎండీ కీర్తి చేకూరి, సీపీడీసీఎల్ సీఎండీ పట్టంన్ శెట్టి రవి సుభాష్, విద్యుత్ ఇంజనీర్ల అసోషియేషన్ ప్రతినిధులు, విద్యుత్ ఉద్యోగుల ఐకాస ప్రతినిధులు పాల్గొన్నారు.