కొవ్వూరు, ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి నది ప్రవాహం ఉధృతిగా ప్రవహించే అవకాశం ఉన్న దృష్ట్యా వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని రెండు రోజుల తరువాత నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డీ. నరసింహా కిషోర్ లు విజ్ఞప్తీ చేశారు.
మంగళవారం ధవలేశ్వరం బ్యారేజీ, కొవ్వూరు ప్రాంతాల్లో ఎస్పీ డీ నరసింహా కిషోర్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ లతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మంగళవారం రాత్రి ఏడు గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందన్నారు. గోదావరిలోకి 10 లక్షల క్యూసక్కుల పైగా నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. బుధవారం రాత్రి 7 గంటల సమయానికి 14 లక్షలు క్యూసెక్కుల మేర వరద నీరు దిగువకు విడుదల చెయ్యడం జరుగుతుందని పేర్కొన్నారు. భద్రాచలం లో కూడా ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చెయ్యడం జరిగిందనీ తెలిపారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో వరద తీవ్రత ఉధృతిగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చెయ్యడం జరిగిందన్నారు. ఇప్పటికే లంక గ్రామాల్లో వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని అన్నారు. ఛత్తీస్ ఘడ్ తదితర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు అవుతున్న మేరకు మరింత ఎక్కువగా వరద నీరు చేరడం వల్ల వరద నీరు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుందని, కావున ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎవ్వరూ గోదావరి నది వద్దకు రావద్దని, రానున్న రెండు రోజులు వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించరాదని, వాయిదా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.