Breaking News

వరద బాధితులకు ఆప్త హస్తం

-ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళాలు… చెక్కులు, అంగీకార పత్రాలు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కి అందజేత
-ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం రూ. 3.92 కోట్లు, పంచాయతీరాజ్ ఛాంబర్-ఏపీ సర్పంచుల సంఘం రూ. 7.7 కోట్ల విరాళం
-రూ. 80 లక్షలు విరాళం ఇచ్చిన విలేజ్ సర్వేయర్లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులు అయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  పిలుపు మేరకు వివిధ సంఘాలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు వరద సహాయక చర్యల కోసం తమవంతు ఆప్త హస్తం అందిస్తున్నారు. ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్  ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి మంగళవారం సాయంత్రం విరాళాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,097 మంది సర్పంచుల ఒక నెల గౌరవ వేతనం మొత్తం రూ.3.92 కోట్లు పవన్ కళ్యాణ్ కి అందజేశారు. సంఘం అధ్యక్షులు చిలకలపూడి పాపారావు ఆధ్వర్యంలో అందుకు సంబంధించిన అంగీకార పత్రాన్ని ఉపముఖ్యమంత్రివర్యులకు అందజేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల ఒక నెల గౌరవ వేతనం రూ. 7.7 కోట్లు విరాళం ఇచ్చారు. ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి  బిర్రు ప్రతాపరెడ్డి, ఛాంబర్ ప్రతినిధులు అందుకు సంబంధించి అంగీకార పత్రాన్ని పవన్ కళ్యాణ్ కి అందజేశారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ విలేజ్ సర్వేయర్లు తమ ఒక రోజు మూల వేతనం రూ.80 లక్షలు పత్రాన్ని ఇచ్చారు. తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత పి.వి.వి.ఎస్.మల్లిఖార్జునరావు రూ. 20 లక్షలు, డ్రీమ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కృష్ణ మణినేని రూ. 10 లక్షల చెక్కులను ఇచ్చారు.

వరద పీడిత పంచాయతీలకు చార్టెర్డ్ అకౌంటెంట్ రూ.10 లక్షల విరాళం
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 400 వరద పీడిత పంచాయతీలకు రూ.లక్ష చొప్పున విరాళం ఇచ్చిన విషయం విదితమే. ఈ బాటలోనే విజయవాడ నగరానికి ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెంట్, రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయుడు 10 వరద పీడిత పంచాయతీలకు రూ.లక్ష చొప్పున రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను పవన్ కళ్యాణ్ కి అందచేశారు. ఈ కార్యక్రమంలో చార్టెర్డ్ అకౌంటెంట్  పెనుగొండ సతీష్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వరద ముంపుకు గురైన 400 పంచాయతీలకు రూ. లక్ష చొప్పున రూ. 4 కోట్లు అందచేసిన పవన్ కళ్యాణ్ కి ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలియచేశారు. కూటమి పాలనలో సర్పంచులకు గౌరవం లభిస్తోందని, వరద పీడిత పంచాయతీల్లో అన్ని శాఖల అధికారులు సర్పంచులను కలుపుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *