– కుటుంబం మొత్తానికి అవసరమైన దుస్తులు, టవల్, దుప్పటి, 20 లీటర్ల వాటర్ క్యాన్ అందజేత
– మొత్తం 1500 కిట్లను బాధితులకు అందజేశామని డాక్టర్ అమ్మన్న వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్, అరుణ్ కిడ్నీ సెంటర్ అధినేత డాక్టర్ ఎన్. అమ్మన్న ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయక సామాగ్రిని అందజేశారు. అజిత్ సింగ్ నగర్ పైపులరోడ్డు సమీపంలోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతంలో డాక్టర్ అమ్మన్న బృందం బుధవారం పర్యటించింది. వరద బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి రిలీఫ్ కిట్లను అందజేశారు. కుటుంబంలోని సభ్యులందరికీ ఉపయుక్తంగా ఉండేలా.. ఒక చీర, పంచె, టవల్, దుప్పటితో పాటు తిరిగి ఉపయోగించుకునేందుకు వీలుపడే 20 లీటర్ల మంచినీటి క్యాన్లను పంపిణీ చేశారు. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన 1500 కుటుంబాలకు ఈ సమగ్ర రిలీఫ్ కిట్లను అందజేసినట్లు డాక్టర్ అమ్మన్న ఈ సందర్భంగా తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రిని కలిసినపుడు ఆయన ఈ రిలీఫ్ కిట్ల గురించి తెలుసుకుని, ప్రత్యేకంగా అభినందించారని గుర్తు చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు తాము కృషి చేస్తున్నామని, బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేశామని తెలిపారు. కోవిడ్ విపత్తు సమయంలో కూడా తాము ప్రజలకు సేవలందించామని అన్నారు. అరుణ్ కిడ్నీ సెంటర్ ఆధ్వర్యంలో వేలాది మందికి కోవిడ్-19 మెడికల్ కిట్లను ఉచితంగా అందజేశామని డాక్టర్ అమ్మన్న పేర్కొన్నారు.