-గోదావరి వరద ఉధృతి దృష్ట్యా వినాయక నిమజ్జనం మరో రెండు రోజులపాటు పొడిగించి నిమజ్జనం చేయాలి
-కాలుష్య రహిత పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై మరింత దృష్టి
-సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పుష్కరాల రేవులో భక్తులు స్నానాలు, వివిధ కార్యక్రమాల నిర్వహణ కొరకు వస్తుంటారని వారి వస్తువుల భద్రత సౌకర్యార్థం లాకర్స్ ఏర్పాటు చేసి ఈరోజు నుంచి అందుబాటులోకి రావడం జరిగిందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. బుధవారం స్థానిక పుష్కరాల రేవులో రుడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 లాకర్స్ ను శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల రేవులో భక్తుల స్నానాలు, వివిధ కార్యక్రమాల నిర్వహణ కొరకు విచ్చేయడం జరుగుతుందని, వారి సామాన్లు భద్రపరుచుకునేందుకు ఇప్పటివరకు ఎటువంటి సౌకర్యం లేదని నేటి నుంచి సామాన్లు భద్రపరుచుకునే విధంగా లాకర్స్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు.
గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను ధవలేశ్వరం బ్యారేజీ వద్ద జారీ చేయడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. గోదావరి వరద ఉధృతిని గమనించి వినాయక నిమజ్జనానికి కార్యక్రమాన్ని మరో రెండు రోజులపాటు పొడిగించి నిమజ్జనం చేయాలని నగరంలో వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసిన ఆయా కమిటీలకు శాసనసభ్యులు వాసు సూచించారు. పుష్కర్ ఘాట్ లో మహిళల కొరకు కేటాయించిన స్నానాల గది చాలా అధ్వానంగా ఉందని దానిని పూర్తిస్థాయిలో ఆధునికరించి మహిళలు స్నానమనంతరం వస్త్రాలు మార్చుకునే విధంగా అందుబాటులోకి తీసుకురావాలని నగరపాలక సంస్థ అధికారులు ఆదేశించారు. నగరంలో గోదావరి తీరం వెంబడి ఘాట్స్ లో ఉన్న చెత్తను తొలగించి మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నగరపాలక సంస్థ, రుడా అధికారులు తదితరులు పాల్గొన్నారు.