– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన, దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లు, దుకాణాలతో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపార సముదాయాలు వంటి ఆస్తులకు సంబంధించిన బీమా క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని.. దీన్ని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సూచించారు. ఈ నెల 9వ తేదీన విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కలెక్టర్ సృజన బుధవారం సందర్శించారు. క్లెయిమ్‌ల స్వీకరణ, సెటిల్‌మెంట్‌కు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ ఎవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా, బీమా కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇప్పటికే అయిదు వేల వరకు క్లెయిమ్‌లు రాగా నాలుగు వేల వరకు క్లెయిమ్‌లను అక్కడికక్కడే సెటిల్‌మెంట్‌కు చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. డాక్యుమెంటేషన్ తదితర విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కేంద్రంలో సేవలందించడం జరుగుతోందని కలెక్టర్ సృజన వివరించారు. కలెక్టర్ వెంట విజయవాడ ఆర్‌డీవో బీహెచ్ భవానీ శంకర్ తదితరులు ఉన్నారు.