-వరద ప్రభావిత ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
-ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల ఆస్తి నష్టాలకు సంబంధించి బీమా క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ కేంద్రం శని, ఆదివారాల్లోనూ పనిచేస్తుందని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సెలవురోజులైన శని, ఆదివారాల్లో కూడా ఫెసిలిటేషన్ కేంద్రం పనిచేసేలా ఏర్పాట్లు చేశామని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివారం తర్వాత కూడా యధాతధంగా ఫెసిలిటేషన్ కేంద్రం కొనసాగుతుందని తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన, దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లు, దుకాణాలతో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపార సముదాయాలు వంటి ఆస్తులకు సంబంధించిన బీమా క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించేందుకు గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ కేంద్రం ఈ నెల 9 నుంచి నిరాంటకంగా సేవలందిస్తోందని, బీమా సంస్థల ప్రతినిధులు ప్రత్యేక కౌంటర్లలో అందుబాటులో ఉంటారన్నారు. ఎవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా, బీమా కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫెసిలిటేషన్ కేంద్రాన్ని చేయడం జరిగిందని.. దీనిద్వారా త్వరితగతిన క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ జరుగుతోందని కలెక్టర్ సృజన తెలిపారు.