-అర్బన్ కంపెనీ సహకారం తో బాధితులకు సేవలు
-మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ముంపునకు గురై నష్టపోయిన బాధితులకు మెప్మా అర్బన్ కంపినీ సంయుక్తం గా పలు సేవలు అందిస్తున్నట్లు మెప్మా డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. ముంపు బాధితులకు అందించే సేవలపై నగరపాలక సంస్థ కార్యాలయం లో డైరెక్టర్ తేజ్ భరత్ శనివారం మెప్మా ఆర్పీలు యుడిసి సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరద ముంపు ప్రాంతాల ప్రజలకు సేవలందించేందుకు సింగ్ నగర్, వాంబే కాలనీ, భవానీపురం, పాయకాపురం, కండ్రిక రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి మెప్మా, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనుసంధానంతో అర్బన్ కంపెనీ యాప్ ద్వారా వివిధ సేవలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.మెప్మా ఆర్‌పీలు, సిబ్బంది వారి పరిధిలోని స్వయంసహాయక సంఘాల సభ్యుల ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి అవసరమైన సేవలు పొందేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకునేలా చేస్తున్నామన్నారు. ఈ రిక్వెస్ట్‌ల ఆధారంగా టెక్నీయిషన్లు స్వయంగా బాధితుల ఇళ్లకు వెళ్లి సేవలందిస్తున్నట్లు వివరించారు. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటర్, కార్పెంటర్, ఏసీ మెకానిక్, టీవీ టెక్నీషియన్ సేవలు అందిస్తున్నటు తెలిపారు. దాదాపు 200 మంది టెక్నీషియన్లు ఈ పనుల్లో నిమగ్నమయ్యారన్నారు. అవసరం మేరకు బయట ప్రాంతాల నుంచి కూడా టెక్నీషియన్లను రప్పించి సేవలందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు చెక్కవస్తువులు పెయింటింగ్ పనులకు సంబంధించి యాప్ లో సూచించిన రేట్లకే సేవలందిస్తారన్నారు. ఈ అవకాశాన్ని ముంపు ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ ఐఏఎస్ కోరారు.