-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరదలతో నష్టపోయిన చిన్న తరహా పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. నగరంలో వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు, వరద ఉద్ధృతితో విజయవాడలోని అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రూ. లక్షలు విలువ చేసే యంత్రాలు పాడైపోవడమే కాకుండా అనేక మంది ఉపాధికి దూరమయ్యారని పేర్కొన్నారు. ప్రదానంగా ఫర్నీచర్, ఫ్లైవుడ్, ప్రింటింగ్ పరిశ్రమలతో పాటు కిరాణా, పండ్లు, పూలు సహా ఇతర చిరు వ్యాపారులు తీవ్ర నష్టాన్ని చవిచూశారన్నారు. అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, రాజీవ్ నగర్, పైపులరోడ్డు, వాంబేకాలనీ, కండ్రిక వంటి చోట్ల దాదాపు 250 కి పైగా వర్క్ షాపులు ఉన్నాయని.. వాటన్నింటిలో ముంపు నీరు చేరడంతో తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఒక్కో వర్క్ షాప్ యజమాని కనీసం రూ. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు నష్టపోయారని.. వీరందరినీ ఎన్యుమరేషన్ లో చేర్చాలని సూచించారు. మరోవైపు వేల మంది కార్మికుల ఉపాధికి గండి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల పాటు ఆయా వర్క్ షాపులు, పరిశ్రమలలో పనులు చేపట్టలేని పరిస్థితులు నెలకొనడంతో.. వీరందరినీ ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు ఓదార్పు మాటలకు పరిమితం కాకుండా.. కేంద్రం నుంచి నిధులు రాబట్టి సర్వం కోల్పోయిన కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పలుచోట్ల పశువులు, పందులు కొట్టుకుపోవడంతో జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలను సైతం ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని కోరారు.