Breaking News

“స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత” ఇతివృత్తంగా స్వచ్ఛతా హి సేవ 2024

-స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ఎండి గంధం చంద్రుడు
-రాష్ట్ర స్ధాయిలో భాగస్వామ్య సంస్ధలతో హైబ్రీడ్ విధానంలో సన్నాహక సమావేశం
-సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 1 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పక్షం రోజుల కార్యక్రమాలు
-అక్టోబరు 2 గాంధీ జయంతి వేళ జాతిపితకు నివాళి అర్పిస్తూ ముగింపు వేడుకలు
-పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది, పురపాలక, పట్టణాభివృద్ది శాఖల సంయిక్త భాగస్వామ్యం
-రాష్ట్ర స్ధాయి నోడల్ ఏజెన్సీగా స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవ 2024 నిర్వహిస్తున్నామని స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ఎండి గంధం చంద్రుడు తెలిపారు. మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ, స్వచ్ఛతను మన జీవన విధానంగా మార్చుకునేలా సమష్టిగా ముందడుగు వేయవలసిన అవశ్యకత ఉందన్నారు. రాష్ట్ర స్ధాయిలో భాగస్వామ్య సంస్ధలతో శనివారం హైబ్రీడ్ విధానంలో ఉన్నత స్ధాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంధం చంద్రుడు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ మిషన్ పదో వార్షికోత్సవం, స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచి పోతుందన్నారు. మహాత్ముడి జయంతి వేళ ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీని స్వచ్ఛ భారత్ దివస్‌గా పాటిస్తున్నామన్నారు. “స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత” ఇతివృత్తంగా స్వచ్ఛతా హి సేవ 2024ను నిర్వహించుకుంటున్నామన్నారు. రాష్ట్ర మంతటా పరిశుభ్రతకు సంబంధించిన కార్యకలాపాల్లో సమష్టి కార్యాచరణ, పౌరులలో భాగస్వామ్య స్ఫూర్తిని పునరుద్ధరించటమే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నామన్నారు. సమాజం మొత్తాన్ని భాగస్వాములను చేసేలా పక్షం రోజుల పాటు మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఈ కార్యక్రమం కొనసాగుతుందని గంధం చంద్రుడు పేర్కొన్నారు.

స్వచ్ఛతా కీ భాగీదారి విభాగంలో తగిన ప్రచారంతో ప్రజల భాగస్వామ్యాన్ని, అవగాహనను ప్రోత్సహించడానికి మారథాన్‌లు, సైక్లోథాన్‌లు, మానవ గొలుసులు నిర్వహిస్తామన్నారు. మొక్కల పెంపంకంతో పాటు ఇతర సుందరీకరణ పనులు చేపట్టవలసి ఉందన్నారు. స్వచ్ఛత లక్షిత్ ఏకాయి – సంపూర్ణ స్వచ్ఛత విభాగంలో అధిక జనసాంద్రత కలిగిన ప్రదేశాలలో సామూహిక పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతూ, పరిశుభ్రత లక్ష్య సాధన కోసం ప్రత్యేకించి ఒక ప్రాంతాన్ని లేదా పారిశుధ్య సమస్యను ఎంపిక చేసుకుని దానికి పరిష్కారాన్ని చూపుతామన్నారు. సఫాయిమిత్ర సురక్ష విభాగంలో పారిశుధ్య కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం, గౌరవాన్ని కాపాడేలా విభిన్న కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆరోగ్యశిబిరాల నిర్వహణ, సంక్షేమ పథకాల లబ్దికి ఏకగవాక్ష విధానాన్ని అమలు చేయటం వంటివి ఉంటాయన్నారు. వారికి ప్రత్యేకంగా భద్రతా శిక్షణలు పిపిఇ కిట్లు అందిస్తామన్నారు. పరిశుభ్రతను కాపాడే క్రమంలో పౌర భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది, పురపాలక, పట్టణాభివృద్ది శాఖలు సంయిక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ రాష్ట్ర స్ధాయి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని గంధం చంద్రుడు వివరించారు.

పక్షం పాటు ప్రతి రోజు ఇలా :
స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా ఈనెల 17న మానవహారం, పరిశుభ్రతపై మెగా డ్రైవ్‌, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవలు, 18న స్వచ్ఛత పరుగులు, బ్లీచింగ్‌, దోమల నివారణ మందులు పిచికారీ, నీరు నిలిచిపోయే ప్రదేశాలను శుభ్ర పరచడం, పారిశుధ్య కార్మికులకు ప్రథమచికిత్స శిక్షణ, 19న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛత ప్రతిజ్ఞలు, డంప్‌ల గుర్తింపు తొలగింపు, పారిశుధ్య కార్మికుల గుర్తించి వారిని మంజూరైన పథకాలతో అనుసంధానం ఉంటుంది. 20న మొక్కల పెంపకం, 21న అవగాహన ప్రచారాలు, ర్యాలీ లు, పరిశుభ్రత డ్రైవ్‌, పార్కుల శుభ్రపరచడం, నిర్వహణ, అభివృద్ధి, పీపీఈ కిట్‌లు, సేప్టీ గేర్లు పంపిణీ నిర్వహిస్తారు. 22న మిషన్‌ లైఫ్‌ ప్రచారాలు, కాలువలు, డ్రైన్లను శుభ్రపరచడం, పారిశుధ్య కార్మికులు, వారి కుటుంబాలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తారు. 23న వర్షపు నీటి నిల్వ, నిర్మాణాల నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు, రహదారుల శుభ్రత, 24న తాగునీటి నిర్మాణాల శుభ్రత, నిర్వహణపై అవగాహన ప్రచారాలు, నీటి నమూనాలను పరీక్షించడం, భద్రత, వ్యక్తిగతరక్షణపై సఫాయి మిత్ర లు వారి కుటుంబాలకు అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. 25న వీధినాటకాలు, మార్కెట్‌ ప్రాంతాలను శుభ్రపరచడం, 26న అవాంఛిత యాప్‌లను క్లియర్‌ చేయడం, సైబర్‌, డిజిటల్‌ స్వచ్ఛత, సంస్థాగత భవనాలు శుభ్రపరచడం, పిల్లల సంరక్షణ కార్యక్రమాలు, చేపడతారు. 27న గ్రామ, వార్డుసభల నిర్వహణ, ప్రభుత్వ ఖాళీస్థలాల సుందరీకరణ, టూరిస్ట్‌ పాయింట్లు, వీధుల పరిశుభ్రత డ్రైవ్‌లు, 28న సాలిడ్‌ వేస్ట్‌ మెనేజ్మెంట్‌ ఆస్తుల సుందరీకరణ, పునర్వినియోగానికి పనికొచ్చే ఇ-వ్యర్ధాలసేకరణ, 29న చెత్తను సృష్టించే ఆర్ట్‌ శానిటేషన్‌ పార్కులపై అవగాహన, అభయారణ్యాలు, జూ ప్రాంతాలు, బీచ్‌లు శుభ్రపరచడం, 30న మూలాల విభజన, రీసైక్లింగ్‌ పద్ధతులు, కంపోస్టింగ్‌పై ప్రదర్శనలు, కమ్యూనిటీ బేస్డ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవగాహన డ్రైవ్‌లు, ఆరోగ్యబీమా నమోదులో సహకారం వంటి కార్యకలాపాలు ఉంటాయి. అక్టోబరు 1న విద్యాసంస్థల్లో స్వచ్ఛ హ్యాకథాన్ల నిర్వహణ, పబ్లిక్‌ టాయిలెట్స్‌ శుభ్రపరచడం, శానిటేషన్‌ కార్మికులు, ఇతరుల గుర్తింపు, సన్మాన కార్యక్రమాలు చేపడతారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *