గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో వరదలు చేసిన నష్ట అనుభవంతో గుంటూరు నగరంలో మురుగు పారుదలకు అడ్డుగా ఉన్న డ్రైన్లపై ఆక్రమణలను సమగ్రంగా తొలగిస్తామని, నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు కూడా సహకరించాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. శనివారం నగరపాలక సంస్థ ప్రదాన కార్యాలయంలో కమిషనర్ చాంబర్ లో విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జిఎంసి తరుపున చేపట్టిన సహాయక చర్యలు, డ్రైన్ల ఆక్రమణలు,పారిశుధ్యం, స్ట్రీట్ వెండింగ్ జోన్లు, జిఎంసి ఆదాయ వనరుల పెంపుకు కార్యాచరణ, స్వచ్చత హి సేవ తదితర అంశాలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరానికి పక్కనే ఉన్న విజయవాడ నగరం ఇటీవల వరద ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిందని, అందుకు వర్షం నీరు డ్రైన్ల లోకి వెళ్ళడానికి డ్రైన్ల పై ఆక్రమణలు పెరగడం ప్రధాన కారణం కాగా బుడమేరుకు గండి పడటం మరో కారణమన్నారు. విజయవాడలోని 62వ డివిజన్ కు ప్రత్యేక అధికారిగా అక్కడి ప్రజల కష్టాలు అతి చేరువగా గమనించామని, డ్రైన్ల ఆక్రమణలు ఎంతటి పెద్ద నష్టాన్నికల్గించాయో ప్రత్యక్షంగా చూశానన్నారు. ఆక్రమణల వలన మేజర్ డ్రైన్లు బ్లాక్ అయ్యి, అంతర్గత డ్రైన్లు, రోడ్ల మీద నీరు వెళ్లడానికి వీలులేక ఇళ్ళల్లోకి చేరి ప్రజా జీవనాన్ని అతలాకుతలం చెసిందన్నారు. తమకు కేటాయించిన డివిజన్ పరిధిలోని నూజివీడు రోడ్ లో షుమారు 5 కిలోమీటర్ల మేర డ్రైన్ల మీద ఆక్రమణలు తొలగించడం వల్లనే ఆయా ప్రాంతాలు వరద నీటిని బయటకు పంపగలిగామన్నారు. అలాగే విజయవాడ వరద బాదిత ప్రాంతాల్లో జిఎంసి ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులు, కార్మికులు విశేష కృషి చేశారన్నారు. ఉదయం టిఫిన్, మధ్యానం, రాత్రికి భోజనం ప్రతి రోజు షుమారు లక్ష ప్యాకెట్స్ అందించామన్నారు. బిస్కెట్స్, పాలు, బ్రెడ్ కూడా అందించి అండగా నిలిచామన్నారు.
విజయవాడ వరద అనుభావాన్ని దృష్టిలో ఉంచుకొని గుంటూరు నగరంలో కూడా ప్రధాన డ్రైన్ల పై ఆక్రమణల తొలగింపు ప్రారంభించామన్నారు. డ్రైన్ల పై ఆక్రమణల వలన పూడికతీత జరగలేదని, ఫలితంగా చిన్నపాటి వర్షాలకు కూడా నీరు రోడ్ల మీద, చుట్టూ పక్కల నివాసాల్లోకి చేరుతుందన్నారు. రాబోవు 10 రోజుల్లో డ్రైన్ల మీద ఆక్రమణలను వారే స్వచ్చందంగా తొలగించుకోవాలని, లేకుంటే జెసిబిల ద్వారా నగరపాలక సంస్థ సిబ్బంది తొలగిస్తారని స్పష్టం చేశారు. ఇప్పటికే క్షేత్ర స్థాయి పర్యటనలో నగరంలోని ఓల్డ్ క్లబ్ రోడ్ డ్రైన్ ను పరిశీలిస్తే పూడిక, వ్యర్ధాలతో ఉండి, ఆక్రమణలతో అత్యంత దారుణంగా ఉందన్నారు. కనుక డ్రైన్ల ఆక్రమణల పై ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు.
గుంటూరు నగర ప్రజారోగ్య కార్మికులు, చెత్త తరలింపు వాహనాలు విజయవాడకు సహాయ చర్యల కోసం వెళ్లడం వలన కొంత పారిశుధ్య సమస్యలు తలెత్తాయని, రానున్న 3 రోజుల్లో అదనపు కార్మికులు, యంత్రాల ద్వారా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
జిఎంసి పరిధిలో డ్రైన్ల మీద, రోడ్ పుట్ పాత్ ల పై అనధికార వీధి వ్యాపారాల వలన ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని, అతి త్వరలో వీధి వ్యాపారుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని రెడ్, గ్రీన్, అంబర్ స్ట్రీట్ వెండింగ్ జోన్ల ఏర్పాటుకు అధికారులు, వివిధ సంస్థల భాగస్వామ్యంతో కమిటి ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రధాన సెంటర్లలో పార్కింగ్ స్లాట్ ల ను గుర్తిస్తామని పేర్కొన్నారు.
జిఎంసి ఆదాయానికి గండి పడే చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించబోమని, ఆస్తి పన్ను విధింపు, త్రాగునీటి కుళాయి మీటర్లు, అనధికార నిర్మాణాలపై తమకు వివిధ వర్గాల నుండి ఫిర్యాదులు అందాయని, వాటిని త్వరలో క్షేత్ర స్థాయి పరిశీలన చేసి భాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్వచ్చతా హి సేవా కార్యక్రమాన్నిగుంటూరు నగరంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో విజయవంతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నామన్నారు.
గుంటూరు నగరాన్ని రానున్న కాలంలో సుందర నగరంగా, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యం, వాతావరణం, ప్రభుత్వ సేవలు అందించడానికి గుంటూరు నగరపాలక సంస్థ నుండి ప్రత్యేక కార్యాచరణ ద్వారా కృషి చేస్తామని, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు కూడా సహకరించాలని కోరారు.
Tags guntur
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …