Breaking News

తొలి తెలుగు ఆది కవయిత్రి మొల్ల

-తెలుగుజాతి గర్వించే రచయిత్రి మొల్ల
-మొల్లను ఆదర్శంగా తీసుకుని బాలికలు ఉన్నత చదువులు చదవాలి
-నన్నయ్య ఆది కవి అయితే మొల్ల ఆది కవయిత్రి
-తెలుగు సాహిత్య చరిత్రలో మొల్లకు ప్రత్యేక స్థానం
-అచ్చ తెలుగు పదాలతో రామాయణం రచించిన మొదటి కవయిత్రి మొల్ల
-ప్రతి ఒక్కరూ మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి
-చేతివృత్తులు, కులవృత్తులను కాపాడుకోవాలి
-కొల్లు రవీంద్ర, రాష్ట్ర ఎక్సైజ్, గనులు, భూగర్భశాస్త్ర శాఖామాత్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ(మొల్ల) తొలి తెలుగు కవయిత్రి అని రాష్ట్ర ఎక్సైజ్, గనులు, భూగర్భశాస్త్ర శాఖామాత్యులు కొల్లు రవీంద్ర అన్నారు. అంతటి కవయిత్రి కాంస్య విగ్రహాన్ని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం అభినందనయమని కొనియాడారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మొల్ల కాంస్య విగ్రహాన్ని మైసూర్ మహారాజా, ఎంపీ, యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తెలుగు జాతికి విలువైన రత్నం మొల్ల అని కొనియాడారు. నన్నయ్య ఆదికవి అయితే ఆదికవయిత్రి మొల్ల అని కీర్తించారు. తెలుగు సాహిత్య చరిత్రలో రచయిత్రి మొల్లకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. రామాయణాన్ని అచ్చ తెలుగులో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అనువదించిన మహా కవయిత్రి మొల్ల అని అన్నారు. మొల్లను ఆదర్శంగా తీసుకుని బాలికలు ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. బాలికల చదువు దేశానికే వెలుగని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
తెలుగు భాష గొప్పదని, అటువంటి తెలుగును భావితరాలకు అందించాలని ప్రతి ఒక్కరూ సంకల్పం చేసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. మాతృభాషకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. ప్రపంచదేశాల్లో ఇప్పటికీ మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు నిలబడ్డాయంటే దానికి కారణం రామాయణం ఒక్కటే అని అన్నారు. చేతివృత్తులు, కులవృత్తులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మహా కవయిత్రి మొల్ల మన తెలుగు రచయిత కావడం మన అదృష్టమన్నారు.
మైసూర్ మహరాజా, ఎంపీ, యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్ మాట్లాడుతూ ఎన్నో శతాబ్ధాల నుండి కన్నడ, ఆంధ్ర రాష్ట్రాలకు సన్నిహిత సంభందాలు ఉన్నాయని గుర్తుచేశారు. తెలుగు కవయిత్రి మొల్ల ఒక ధీరవనిత అని కొనియాడారు. నాటి కాలంలో రాజాస్థానాల అండ లేకుండ ఒక కావ్యం రాయలేరని, కాని మొల్ల ఏ రాజాస్థానం అండ లేకుండ అచ్చతెలుగులో రామాయణం రచించి ఆ శ్రీ రాముడికే అంకితమిచ్చారన్నారు. శ్రీ కృష్ణదేవరాయల కాలం నుండి రెండు రాష్ట్రాల మధ్య మంచి మైత్రీ కొనసాగుతుందన్నారు. మైసూర్ ఆస్థానంలో ఎందరో తెలుగు వారు వివిధ పదవులు అలంకరించారన్నారు. మోక్షగుండం విశ్వశ్వరయ్య తెలుగు సంతతి వాడని ఆయన గురించి తెలియని భారతీయుడు ఉండడన్నారు. తెలుగు రాష్ట్రంలో కుమ్మరి శాలివాహన సంఘ అభివృద్ధికి ఐలాపురం వెంకయ్య విశేష కృషి చేస్తున్నాడన్నారు.
కార్యక్రమంలో ఎంఎల్సీలు దువ్వారపు రామారావు, కె.ఎస్. లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, గద్దే రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావ్, కమ్మరి శాలివాహన సంఘ ప్రముఖులు ప్రసంగించారు. అనంతరం నిర్వాకులు మంత్రి కొల్లు రవీంద్ర, అతిధులను ఘనంగా సత్కరించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *