-అస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పాల్గొనేందుకు ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రూ. 3 లక్షల అందజేత
-మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన కేళావత్ చరణ్ నాయక్
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన దాతృత్యాన్ని చాటుకున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కేళావత్ చరణ్ నాయక్ అస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరగనున్న ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ షటిల్ బ్యాండ్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ రూ.3 లక్షలు ఆర్థిక సహాయం చేశారు. కేళావత్ చరణ్ నాయక్ అస్ట్రేలియాలో అక్టోబర్ నెల 16 నుంచి 20 వరకు, న్యూజిలాండ్‌లో అక్టోబర్ నెల 23 నుంచి 26 వరకు జరగనున్న ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మంత్రి నారా లోకేష్ ను కలిసి రెండు దేశాలలో పాల్గొనడానికి కావలసిన ఆర్థిక సాయం చేయాలని కోరారు. స్పందించిన మంత్రి నారా లోకేష్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని చరణ్ నాయక్‌కు భరోసా ఇచ్చారు. వెంటనే ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రూ.3 లక్షలను స్థానిక నాయకుల ద్వారా చరణ్ నాయక్‌కు అందజేయించారు. అడిగిన వెంటనే రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందజేసిన మంత్రి నారా లోకేష్ కు చరణ్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడుతూ కేళావత్ చరణ్ నాయక్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనడం మంగళగిరి ప్రజలకు గర్వకారణమని అన్నారు. అస్ట్రేలియా, న్యూజిలాండ్ పోటీల్లో రాణించి దేశానికి మంగళగిరికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేష్ మొదటి నుంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. గత నెలలో పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మాస్ అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు రూ. 3 లక్షలు సాయం చేయగా ఆమె గోల్డ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. గ్రామీణ యువతి, యువకుల్లో నైపుణ్యాలను గుర్తించేందుకు మంత్రి నారా లోకేష్ కీడ్రాపోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని రకాల క్రీడలకు అనుకూలంగా ఉండేలా మంగళగిరి, తాడేపల్లిలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేలా మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి మండల పార్టీ అధ్యక్షులు తోట పార్థసారథి, మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.