-రాష్ట్రంలోని విజయవాడ తదితర ప్రాంతాలు వరదలతో నష్టపోయిన బాధితుల సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆపన్న హస్తం కు తోడుగా మేము సైతం అని వరద బాధితుల సహాయార్థం తిరుపతి జిల్లా యంత్రాంగం నుండి రూ. 84,50,193 విలువగల సాయం అందించిన తిరుపతి జిల్లా యంత్రాంగం
-వరద బాధితుల సహాయార్థం ముందుగా జిల్లాలో తన నెల జీతంలో సగభాగం విరాళంగా ప్రకటించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ స్పూర్తితో వరద బాధితులకు పలువురి విరాళాలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, విజయవాడ తదితర ప్రాంతాలు వరదలతో అతలాకుతలం అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసి అందించిన ఆపన్న హస్తం కు తోడుగా మేము సైతం అని తిరుపతి జిల్లా యంత్రాంగం నుండి వరద బాధితులకు పలు విధాలుగా సాయం అందించడానికి చర్యలు తీసుకున్నామని, పలువురు దాతల నుండి అందిన విరాళాల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 57,48,408 లను జమ చేయనున్న నేపథ్యంలో మెగా చెక్కును జెసి శుభం బన్సల్ తో కలిసి మీడియా సమక్షంలో జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ విడుదల చేశారు.
బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రెండు వారాల క్రితం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, విజయవాడ నందు భారీ వర్షాల కారణంగా వరదల వలన పలు ప్రాంతాలు నీట మునిగి నష్టపోయిన బాధితులను ఆదుకొనుటకు అవిశ్రాంతంగా సుమారు10 రోజుల పైగా మన గౌరవ ముఖ్యమంత్రి కృషిచేసి అధికారులు, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకొని ఆపన్న హస్తం అందించారని, దానికి తోడుగా మేము సైతం అని తిరుపతి జిల్లా నుండి వరద బాధితులకు పలు విధాలుగా సాయం అందించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. తాను జిల్లాలో మొట్ట మొదటగా తన నెల జీతంలో సగభాగం విరాళంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందచేశానని, దాతలు ముందుకు వచ్చి వరద బాధితులకు అండగా నిలవాలని తాను ఇచ్చిన పిలుపు మేరకు దాని స్పూర్తితో జిల్లాలోని ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, పలు శాఖల ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలు, విద్యాసంస్థలు, విశ్రాంత ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు పలువురు స్వచ్చందంగా వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు సుమారు రూ. 84,50,193 లను ఇప్పటి వరకు అందచేశారని తెలిపారు. అందులో ఇప్పటికే జిల్లా యంత్రాంగం దాతల నుండి అందిన విరాళాలలో సుమారు రూ.24,30,500 ల విలువైన వాటర్ బాటిల్స్, పాల టెట్రా ప్యాకెట్లు, బిస్కట్ ప్యాకెట్లు,అగ్గి పెట్టెలు, కొవ్వొత్తులు బ్రాండెడ్ వస్తువులను వరద బాధితుల సహాయార్థం విజయవాడకి పంపడం జరిగిందనీ తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎవరికి తోచిన విధంగా వారు దాతలు వరద బాధితులకు భోజన సహాయము, వస్తురూపేనా సాయం అందిస్తున్నారని, ముఖ్యమంత్రి సహాయనిధికి డబ్బు సహాయం అందిస్తున్నారని తెలిపారు.
మన జిల్లాలో నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం రూ. 27,01,760 లను విరాళంగా అందజేయడం జరిగిందని, అకార్డ్, సాకేత్, ఎడిఫై తదితర విద్యా సంస్థలు, విద్యార్థులు, పంచాయతీరాజ్, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, విశ్రాంత ఉద్యోగులు పలువురు అధికారులు, పలు పరిశ్రమలు శ్రీ సిటీ, శ్రీకాళహస్తి ఎలక్ట్రో స్టీల్ కంపెనీ, అపోలో టైర్స్ తదితరులు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారని, దాతలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని కలెక్టర్ అన్నారు.
అలాగే తిరుపతి జిల్లా నుండి పలు శాఖల విభాగాల ద్వారా రెవెన్యూ, మునిసిపాలిటీ, పంచాయితీ తదితర శాఖల నుండి పలువురు అధికారులు, సిబ్బంది విజయవాడ వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలలో, ఎన్యుమరేషన్ నందు భాగస్వాములయ్యారు అని తెలిపారు.
అనంతరం తిరుపతి జిల్లా యంత్రాంగం నుండి వరద బాధితుల సహాయార్థం పలువురు దాతల నుండి అందిన విరాళాల ద్వారా వస్తూ రూపేణ అందించినది కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధికి నేడు రూ. 57,48,408 లను జమ చేయు నిమిత్తం మెగా చెక్కును జెసి తో కలిసి కలెక్టర్ విడుదల చేశారు.
మన వంతు సాయంగా ఈ ప్రకృతి విపత్తు బాధితుల సహాయార్థం జిల్లా లోని దాతలు ఎవరైనా వారికి తోచిన సాయం కింద తెలిపిన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ లేదా చెక్కు ద్వారా వారి పూర్తి వివరాలు తెలుపుతూ స్వచ్చందంగా విరాళాలు అందించాలని ఇందులో ఎలాంటి నిర్భందం లేదని సదరు విరాళాలను గౌ. ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయడం జరుగుతుందనీ కలెక్టర్ తెలిపారు.
Account details:
Name: DISTRICT COLLECTOR TIRUPATI CMRF
A/c no: 230612010000689
IFSC code: UBIN0823066
ఈ సమావేశంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.