గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లాలో నిర్వహిస్తున్న “స్వచ్ఛతాహి సేవా పక్షోత్సవాలు” సందర్భంగా బుధవారం ఉదయం గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ జి బాలసుబ్రహ్మణ్యం, మాజీ మునిసిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, విద్యార్థులతో కలిసి పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన సైకిల్ ర్యాలీ ప్రారంభించారు.
అడుసుమిల్లి గోపాలకృష్ణ మున్సిపల్ ఉన్నత పాఠశాల, శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ ఉన్నత పాఠశాల 100మంది విద్యార్థులు, గుడివాడ సైక్లింగ్ క్లబ్ సభ్యులు 50 మందితో గుడివాడ మున్సిపల్ కార్యాలయం నుండి పట్టణ ప్రధాన వీధుల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతాహి సేవా పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా గుడివాడ పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణ వాసులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగించేందుకు విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పుర ప్రముఖులతో కలిసి సైక్లోథాన్ కార్యక్రమం నిర్వహించటం జరిగిందన్నారు.
ప్రభుత్వ సూచనల మేరకు పారిశుధ్యంపై ప్రతిరోజూ ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలందరూ వారి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ నెల 17 నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యార్థులు, గుడివాడ సైక్లింగ్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.