మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించడం “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా కలెక్టర్ శుక్రవారం స్థానిక 6వ డివిజన్ బ్రహ్మపురంలో అధికారులతో కలిసి పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని, కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరించారు. కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లు 3 వేల రూపాయల నుండి 4 వేల రూపాయలకు పెంపు చేయడంతో పాటు, 2024 ఏప్రిల్ నుంచి పెంచిన పింఛను జూలై నెలలో 7వేల రూపాయలు లబ్ధిదారులకు అందించిన విషయం కలెక్టర్ వివరించి, అదేవిధంగా అంగవైకల్యం కలవారికి, బెడ్ రిడెన్ వారికి 15 వేల రూపాయల వరకు పింఛను పెంపు చేయడం జరిగిందని వివరించారు. ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించి బడుగు బలహీన శ్రామిక వర్గాలకు 5 రూపాయలకే అల్పాహారం, 5 రూపాయలకే భోజనం అందిస్తోందన్నారు.
ఈ పర్యటనలో వృద్ధురాలు వీరరాజేశ్వరి తన చేయి ఫ్రాక్చర్ అయిందని, సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నానని తెలుపగా, కలెక్టర్ స్పందించి ఆమె కుమారునితో ఫోన్లో మాట్లాడి ఆమెకు అందిన వైద్యం గురించి అడిగి తెలుసుకుని, ఈమె వివరాలు తీసుకుని ఎన్టీఆర్ వైద్య సేవ కింద అవసరమైతే విజయవాడ రిఫర్ చేసి నెట్వర్క్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 6వ డివిజను బ్రహ్మపురంలో (కలెక్టరేట్ వెనుక) గతంలో రెవిన్యూ ఉద్యోగులకు ప్రభుత్వం మార్కెట్ ధరకు కేటాయించిన స్థలాలలో నివసిస్తున్న వారు లేదా వారి వారసులు తమ ఇబ్బందులు కలెక్టర్కు వివరిస్తూ 22a నిషేధిత జాబితాలో ఉన్నందున క్రయవిక్రయాలకు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని తెలుపగా, సంబంధిత ఫైలు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక నాయకులు దిలీప్ డివిజన్లో సమస్యలు కలెక్టర్కు వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు, జెడ్పిసిఈఓ ఆనంద్ కుమార్, స్థానిక సచివాలయ సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు.