-కాన్క్లేవ్ కు హాజరైన 200 మందికి పైగా పర్యాటక ప్రతినిధులు
-రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-వియత్నాం తరపున ముఖ్య అతిథిగా హాజరైన హెచ్. ఈ. ఎంగ్యూయేన్ థాన్హయ్
-ఆంధ్రప్రదేశ్, వియత్నాం మధ్య పర్యాటక మరియు కల్చరల్ ఎక్స్చేంజ్కు మరింత బలం చేకూర్చే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు
-రెండు దేశాల మధ్య పర్యాటక అవకాశాలపై దృష్టి సారించిన ప్రతినిధులు
-రాష్ట్రంలో రెండు ప్రధాన బౌద్ధ సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రతిపాదన
-రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధికి సహకరించాలని కోరిన మంత్రి కందుల దుర్గేష్
-రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, సంస్కృతి, ప్రత్యేకతలను తెలుపుతూ వీడియో ప్రదర్శన.. ఆహుతులను ఆకట్టుకున్న వీడియో
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్, వియత్నాం మధ్య పర్యాటక మరియు కల్చరల్ ఎక్స్చేంజ్కు మరింత బలం చేకూర్చే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.. శుక్రవారం విజయవాడ లోని నోవాటెల్ హోటల్ “ఆంధ్రప్రదేశ్-వియత్నాం టూరిజం కాన్క్లేవ్- 2024” జరిగింది.. కాన్క్లేవ్ కు 200 మందికి పైగా పర్యాటక ప్రతినిధులు హాజరయ్యారు.
ఐరా ఓవర్సీస్ స్టడీస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్,వియత్నాం తరపున ముఖ్య అతిథిగా హెచ్. ఈ. ఎంగ్యూయేన్ థాన్హయ్ హాజరయ్యారు..స్థానిక పర్యాటకం పై ఆసక్తి కనబరిచిన వియత్నాం ప్రతినిధులకు స్వయంగా మంత్రి దుర్గేష్ ఆహ్వానం పలికారు. బౌద్దరామాలు, స్మారకాలపై వియత్నాం ఆసక్తిని కనబర్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండు ప్రధాన బౌద్ధ సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని మంత్రి దుర్గేష్ ప్రతిపాదించారు.. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పర్యాటక అభివృద్ధి గల అవకాశాలను మంత్రి వివరించారు. కాన్ క్లేవ్ లో భాగంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, సంస్కృతి, ప్రత్యేకతలను తెలుపుతూ ప్రదర్శించిన వీడియో ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విజయవాడ లో టూరిజం కాన్ క్లేవ్ జరగడం సంతోషంగా ఉందన్నారు. సంస్కృతి, చరిత్ర, ప్రకృతి అందాలు, సజీవ నదులు, విశాల సముద్ర తీరంతో అలరారుతున్న ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలతో పాటు పదుల సంఖ్యలో బౌద్ధ రామాలు, చారిత్రక ప్రదేశాలు, పుణ్య క్షేత్రాలు, విహార స్థలాలున్నాయని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా వియత్నాం ప్రతినిధులకు వివరించారు.. అత్యధిక పర్యాటకులు సందర్శించే ప్రాంతంగా భారత దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము బౌద్ధ వారసత్వాన్ని కలిగి ఉన్న నేపథ్యాన్ని మంత్రి దుర్గేష్ వివరించారు. ధాన్యకటకం (అమరావతి), భట్టిప్రోలులోని మహాస్థూపాలు, గుంటుపల్లిలోని రాతి గుహలు వంటి స్మారక ఆధారాలను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉందని గుర్తు చేశారు. మహాయాన బౌద్ధమతానికి జన్మస్థలంగా, 40కి పైగా ముఖ్యమైన స్మారక చిహ్నాలకు ఆంధ్ర ప్రదేశ్ నిలయంగా ఉందన్నారు. రాష్ట్రంలో రెండు ప్రధాన బౌద్ధ సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని మంత్రి దుర్గేష్ ప్రతిపాదిస్తూ శ్రీకాకుళం – విశాఖపట్నం మధ్యన కళింగపట్నం, ముఖలింగం, శాలిహుండం, రామతీర్థం, తొట్లకొండ, పావురాలకొండ, బావికొండ, బొజ్జన కొండ, శంకరం, ఆదుర్రు, కొత్తూరు అదేవిధంగా అమరావతి-నాగార్జునకొండ మధ్యలో గుడివాడ, అమరావతి, జగ్గయ్యపేట, అల్లూరు నాగార్జునకొండ, అనుపు, చాదవరం, ఘంటసాల, ఉండవల్లి, భట్టిప్రోలు, గుంటుపుల్లి తదితర బౌద్ధ రామాల గురించి ప్రస్తావించారు.. ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ వారసత్వాన్ని చాటిచెప్పే లుంబినీ ఉత్సవాన్ని ప్రస్తావిస్తూ.. మూడు రోజుల పాటు నాగార్జున సాగర్‌లో ఉత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ ఉత్సవం అనేక మంది పర్యాటకులను, యాత్రికులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు..
భారతదేశం మరియు వియత్నాం మధ్య చారిత్రక బంధం బలోపేతం చేస్తున్నందుకు పర్యాటక శాఖ మంత్రిగా సంతోషంగా ఉందని మంత్రి దుర్గేష్ ఆనందం వ్యక్తం చేశారు.. ఆతిథ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యావరణ-పర్యాటక రంగాలలో జాయింట్ వెంచర్లను ప్రోత్సహించాలని మంత్రి దుర్గేష్ కోరారు. రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధికి సహకరించాలని విన్నవించారు. రాష్ట్ర సుస్థిర పర్యాటక అభివృద్ధికి ఫలవంతమైన చర్చలు జరగాలని ఆశించారు.
గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రత్యేకించి అమరావతి రాజధాని అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా డైనమిక్ లీడర్ షిప్ ఉందని, ఇప్పుడిప్పుడే అనుభవం కలిగిన నాయకుడి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథం లో ముందుకు వెళ్తుందన్నారు..ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాద్, సైబరాబాద్ లు అభివృద్ధి చెందిన విషయం మంత్రి గుర్తు చేశారు..రాష్ట్రంలో అమరావతి చెంతన కృష్ణా నది ఉందని ఈ నేపథ్యంలో రివర్ ఫ్రంట్ ఏరియా అభివృద్ధి చేయాలని భావిస్తున్నామన్నారు. ఇరు ప్రాంతాల మధ్య సమన్వయము కోసం భాషా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాన బౌద్ధ గమ్యస్థానాలకు కనెక్ట్ చేయాల్సిన అంశాన్ని వివరిస్తూ ఉత్తరప్రదేశ్ లో శ్రీవస్తి, ఖుషీనగర్, సారనాథ్, బీహార్ లో బుద్ద గయా, రాజ్‌గిర్, వైశాలి ప్రాంతాలను గురించి మంత్రి వివరించారు. అదేవిధంగా 2023లో భారత్ నుండి వియత్నాం కు 3,92,000 మంది, 2022లో వియత్నాం నుండి 37,232 మంది పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించారని గుర్తుచేశారు.. ఇది ఇరు దేశాల మధ్య ప్రయాణాలపై పెరుగుతున్న ఆసక్తిని వెల్లడిస్తుందని తెలిపారు..
వియత్నాం ప్రతినిధి మాట్లాడుతూ హెచ్. ఈ. ఎంగ్యూయెన్ థాన్హయ్ మాట్లాడుతూ తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్నామన్నారు. భారత్- వియత్నాం, ఆంధ్ర ప్రదేశ్- వియత్నాం మధ్య సంబంధాలు బలోపేతం అవ్వాలని ఆశిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాగా సహకరించిందని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో పర్యాటక ప్రాంతాలు తమను ఆకట్టుకున్నాయన్నారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజినరీ లీడర్ అని కొనియాడారు..ఇప్పటికే భారత్ లో తమ దేశ ప్రధాని పర్యటించి బలమైన సంబంధాలకు బాటలు వేశారని వెల్లడించారు..ఈ సందర్భంగా వియత్నాం దేశంలో పర్యాటక అభివృద్ధిని వివరిస్తూ వీడియో ప్రదర్శించారు.
ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్ రావు, టూరిజం అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ మోహన్ లు మాట్లాడుతూ రాష్టంలో పర్యాటక అభివృద్ధికి గల అవకాశాలను వెల్లడించారు..
కాన్ క్లేవ్ లో భాగంగా రెండు దేశాల మధ్య పర్యాటక అవకాశాలు మెరుగయ్యేలా దృష్టి సారిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. తమను ఎందుకు పెట్టుబడిదారుగా ఎంపిక చేసుకోవాలో కారణాలను,సాధించిన విజయాలను వివరించారు.
కార్యక్రమం చివర్లో లక్కీ డ్రా తీసి కొన్ని టూరిజం సంస్థలకు మంత్రి దుర్గేష్, వియత్నాం ప్రతినిధి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అదేవిధంగా వియత్నాం ప్రతినిధికి మంత్రి జ్ఞాపికను అందజేశారు.
కాన్ క్లేవ్ లో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్ రావు, టూరిజం అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ మోహన్, ఐరా ఓవర్సీస్ స్టడీస్ వ్యవస్థాపకురాలు, సీఈఓ దీప, సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.