-2,740 ఖాతాలకు సంబంధించిన దరఖాస్తులు పరిష్కరించాం.
-రూ. 148.22 కోట్ల రీషెడ్యూలింగ్‌తో పాటు
కొత్తగా రూ. 9.62 కోట్ల రుణాలు మంజూరు చేశాం.
-జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముంపు ప్రభావిత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని యుద్ధప్రాతిపదికన బ్యాంకింగ్ సేవలు అందించడం జరుగుతోందని.. మూడు రోజుల్లో 2,740 ఖాతాలకు సంబంధించి రూ. 157.85 కోట్ల విలువైన బ్యాంకింగ్ సేవలు అందించినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
1,900 రుణ ఖాతాలకు సంబంధించి రూ. 148.22 కోట్లకు రీషెడ్యూలింగ్ చేయడం జరిగిందన్నారు. కొత్త రుణాల దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించడం జరుగుతోందని.. ఇప్పటివరకు కొత్తగా 840 ఖాతాలకు రూ. 9.62 కోట్ల మేర రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో 310 ఖాతాలకు రూ. 77.50 లక్షల మేర వినియోగ రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. శనివారం ఒక్కరోజే 450 ఖాతాలకు సంబంధించి రూ. 28.96 కోట్ల మేర రుణాలను రీషెడ్యూలింగ్ చేయడంతో పాటు కొత్తగా 315 ఖాతాలకు రూ. 1.83 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు వివరించారు. ఇందులో 190 ఖాతాలకు రూ. 47 లక్షల మేర వినియోగ రుణాలు మంజూరుచేయడం జరిగిందన్నారు. బాధిత ప్రజలకు భరోసా కల్పించేందుకు ముందుకొచ్చిన బ్యాంకుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సృజన సూచించారు. అదే విధంగా ఈ నెల 8వ తేదీ మొదలు క్యాన్సిలేషన్ రిక్వెస్టులు పోను అర్బన్ కంపెనీ యాప్‌లో ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటర్, ఏసీ మెకానిక్ ఇలా వివిధ సేవలు పొందేందుకు నికరంగా 5,149 రిక్వెస్టులు నమోదయ్యాయని.. వీటిలో 95.6 శాతం అంటే 4,922 రిక్వెస్టులను పరిష్కరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.