– ఈ నెల 25న బాధితుల ఖాతాల్లో నష్ట పరిహారం జమ
– 179 సచివాలయాల పరిధిలో ఎన్యూమరేషన్ పూర్తిచేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం.
– జాబితాలో చేర్చాలంటూ 38వ వార్డు నివాసితుల నుంచి విజ్ఞప్తులు.
– 38వ వార్డు ఎన్యూమరేషన్ పరిధిలో లేనందునే సర్వే నిర్వహించలేదు.
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముంపు ప్రభావిత 179 సచివాలయాల పరిధిలో అత్యంత పారదర్శకంగా నష్ట గణన ప్రక్రియను పూర్తిచేసి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25న బాధితుల ఖాతాల్లో డీబీటీ విధానం ద్వారా నేరుగా పరిహారం మొత్తాన్ని జమచేయనున్నట్లు వెల్లడించారు. ఏ ఒక్క బాధిత కుటుంబం ఎన్యూమరేట్ కాకుండా ఉండకూడదనే గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా పలు అవకాశాలు కల్పించడం జరిగిందని.. అర్హుల జాబితాలను సచివాలయాల్లోనూ ప్రదర్శించినట్లు తెలిపారు. వివిధ కారణాల వల్ల ఎన్యూమరేషన్ సమయంలో ఇళ్లవద్ద లేని వారిని కూడా ప్రత్యేక బృందాలతో ఆది, సోమవారం ప్రత్యేకంగా నమోదు చేసినట్లు వివరించారు. అయితే 38వ వార్డు నివాసితులు కొందరు తమను కూడా ముంపు బాధితుల జాబితాలో చేర్చాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారని.. ఈ వార్డు ఎన్యూమరేషన్ పరిధిలోకి రాదని.. అందువల్లే సర్వే నిర్వహించలేదని వివరించారు. ప్రత్యేక బృందాలను పంపించడం జరిగిందని.. ఈ బృందాల విచారణలో 38వ వార్డు నివాసితులు అర్హులు కాదని గుర్తించినట్లు కలెక్టర్ సృజన స్పష్టం చేశారు.
ముంపు ప్రాంతాల్లో కుటుంబాలకు జరిగిన నష్టాన్ని 1500 బృందాలతో అంచనా వేయడం జరిగిందని.. ఐఏఎస్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎన్యూమరేషన్ ప్రక్రియ అత్యంత పారదర్శ కంగా, జవాబుదారీతనముతో జరిగిందని జిల్లా కలెక్టర్ డా. సృజన తెలిపారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఉండేందుకు జిల్లా స్థాయి అధికారులతో రీ వెరిఫికేషన్ ప్రక్రియను కూడా నిర్వహించడం జరిగిందన్నారు. ఏ ఒక్క బాధిత కుటుంబం ఎన్యూమరేట్ కాకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో మీడియా ద్వారా కూడా సమాచారం ఇచ్చి ఆది, సోమవారం రెండు రోజులపాటు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి మిగిలిపోయిన కుటుంబాలను కూడా జాబితాలో చేసినట్లు వివరించారు. ఈ విధంగా ప్రతి బాధిత కుటుంబానికి కలిగిన నష్టాన్ని నమోదు చేయడం జరిగిందన్నారు. ఇంత చేసినప్పటికీ ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారి దరఖాస్తులను కూడా పరిశీలించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి భరోసా కల్పించారని.. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని కలెక్టర్ సృజన స్పష్టం చేశారు.