Breaking News

గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గుజరాత్ లో రెండో రోజు పర్యటనలో భాగంగా నేడు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ ని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు & మౌలిక వసతుల శాఖ మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అహ్మదాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భూపేంద్రభాయ్ పటేల్ ను కలిసిన మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి.. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, సత్కరించారు. ఈ సందర్భంగా గుజరాత్ సీఎంకు వాగ్దేవి ప్రతిమను మంత్రి బహుకరించడం జరిగింది. అనంతరం మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డిని గుజరాత్ సీఎం సైతం పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించడం జరిగింది.

గుజరాత్ రాష్ట్ర రహదారులు & భవనాల శాఖ మంత్రి కూడా స్వయంగా సీఎం భూపేంద్రభాయ్ పటేల్ కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే గుజరాత్ లో పబ్లిక్ ప్రవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో రోడ్ల అభివృద్ధి, నిర్మాణం గురించి, మంత్రి నేతృత్వంలో రాష్ట్ర బృందం సందర్శించిన ప్రాంతాల గురించి భూపేంద్రభాయ్ పటేల్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర బృందం గత రెండు రోజులుగా చేసిన అధ్యయనం గురించి ఆయన ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

దాదాపు 15 నిమిషాలు పైగా గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ తో జరిగిన ఈ భేటీలో.. పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తోన్న 14 రోడ్లు విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. గుజరాత్ లో ఇప్పటికే ఉన్న 2 లైన్ల రహదారులను 4 లైన్ల రహదారులుగా, 4 లైన్ల రహదారులను.. 6 లైన్ల రహదారులుగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే గుజరాత్ రాష్ట్రంలోని పోర్టులు, ఎయిర్ పోర్టులు, మారిటైమ్ బోర్డు శాఖలను కూడా ముఖ్యమంత్రే స్వయంగా చూస్తున్న విషయాన్ని ఆయనే తెలియజేశారు.. గుజరాత్ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో భారీ, మధ్య తరహా పోర్టులు కలిపి మొత్తంగా 46 వరకు నడుస్తోన్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దేశంలోనే అత్యధికంగా ఆర్ & బీ శాఖకు 15 శాతం బడ్జెట్ కేటాయింపులు చేసే ఏకైక రాష్ట్రం తమదేనని ఆయన చెప్పడం జరిగింది.

అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజనరీ లీడర్ అంటూ.. ఆయన అనుభవం, దార్శనికతను ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ కొనియాడారు.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మరింత వేగంగా అభివృద్ధి దిశలో అడుగులు వేస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ తో భేటీ అనంతరం మరి కొన్ని ప్రాంతాలను మంత్రి ఆధ్వర్యంలోని కమిటీ సందర్శించింది. ముఖ్యంగా నేటి పర్యటనలో నర్మదా నది రివర్ ప్రంట్, గాంధీ నగర్ మెట్రో రైల్ ను సందర్శించడం జరిగింది. అలాగే స్వాతంత్ర పోరాటంలో ఉప్పు సత్యగ్రహం ఉద్యమానికి, మహాత్ముడి పోరాటాలకు కార్యక్షేత్రంగా నిలిచిన సబర్మతి ఆశ్రమాన్ని, గాంధీ ఆశ్రమాన్ని సైతం సందర్శించడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్రమోదీ స్టేడియంను కూడా ఈ పర్యటనలో భాగంగా మంత్రి ఆధ్వర్యంలోని కమిటీ సందర్శించడం జరిగింది.

రెండు రోజుల గుజరాత్ పర్యటన నేటితో ముగియడంతో ఈరోజు మంత్రి ఆధ్వర్యంలోని హైలెవల్ కమిటీ తిరుగు పయనం కానుంది. ఈ సమావేశంలో మంత్రితో పాటు ఆర్ & బీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఏపీఆర్డీసీ ఛీప్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, మరియు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *