-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లలను ఉత్తమ పౌరులుగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక తాలూకా రైస్ మిల్లర్స్ ఫంక్షన్ హాల్ లో జరిగిన “బేటి బచావో – బేటి పడావో” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, బాలల అక్రమ రవాణా నివారణ మనందరిపై ఉన్న బాధ్యత అన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై పిల్లలకి అవగాహన కల్పించాలని, ముఖ్యంగా మగపిల్లలకు అవగాహన కల్పించడం ద్వారా బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపు ఇచ్చారు. కుటుంబంలో మాదిరి బయట ఆడపిల్లలను సోదరి భావంతో చూసేలా పిల్లలను తీర్చిదిద్దాలన్నారు. ఆడపిల్లలతో సత్ ప్రవర్తన కలిగి ఉండేలా చూసుకోవాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కట్టుబడి ఉండాలని కోరారు. బాలలు తమ ఇబ్బందులూ చెబుతుంటే వినాలని, వినని యెడల వారి హక్కులను హరించిన వారమౌతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బాలల అక్రమ రవాణా నివారించడం, పౌష్టిక ఆహారం లోపం లేకుండా చూడడం మన బాధ్యత అని, ఇందుకోసం కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు వారికీ అందజేయడం జరుగుతోందని తెలిపారు..
బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన సామాజిక బాధ్యత మనందరిపై ఉందనీ మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. విద్య విషయంలో అమ్మాయి, అబ్బాయి అనే వివక్ష సరికాదని మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి వారికి సముచిత గౌరవాన్ని ఇచ్చి పోషక ఆహార కిట్లు, చీరలు అందచజేశారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన తర్వాతే బాలికలకు వివాహం చేయాలన్నారు, అధికారులు చెప్పినట్లు అప్పుడే వారు పూర్తి స్థాయిలో మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని పేర్కొన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించిసమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు కృషి చేద్దామన్నారు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం అవుదామని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్పిడి కే విజయ్ కుమారి, నిడదవోలు మున్సిపల్ కమిషనర్, తహసిల్దారు బి నాగరాజు నాయక్, స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.