– ముంపు సమస్య శాశ్వత పరిష్కారంలో భాగంగా చర్యలు
– రైల్వేతో ముడిపడిన అంశాల్లో పురోగతిపై ప్రతి నెలా సమావేశాలు
– విజయవాడ అర్బన్ పరిధిలో ఈ నెల 3, 4 తేదీల్లో ఉమ్మడి తనిఖీల నిర్వహణ
– విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల వరద ముంపుతో విజయవాడ, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారని.. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు, శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని, ఇందులో భాగంగా డ్రెయిన్ల వ్యవస్థపై దృష్టిసారించామని, ఈ నెల 3, 4 తేదీల్లో ఉమ్మడి తనిఖీలు నిర్వహించనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు.
మంగళవారం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డా. జి.సృజన, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర.. విజయవాడ ఆర్‌డీవో కె.చైతన్య, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రెవెన్యూ, మునిసిపల్, ఆర్ అండ్ బీ తదితర శాఖల అధికారులతో రైల్వేతో ముడిపడిన ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఎస్టేట్ సెక్షన్ల అంశాలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. కమిషనర్ ధ్యానచంద్ర పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివిధ అంశాలను వివరించారు. డ్రెయిన్లలో పూడికతీత, పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు మ్యాన్‌హోళ్ల వద్ద తేలియాడే చెత్తాచెదారం తొలగింపు, సుందరీకరణ, సీసీ అప్రోచ్, ఆర్‌వోబీ/ఆర్‌యూబీల మంజూరు, నిర్మాణం, ఆక్రమణలు తదితరాలపై సమావేశంలో చర్చించారు. వర్షాల సమయంలో నీరు సజావుగా పారేందుకు వీలుగా డ్రెయిన్లలో పూడికను యుద్ధప్రాతిపదికన తీసేందుకు రైల్వేతో పాటు వివిధ శాఖల సమన్వయంతో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రైల్వే వంతెనల వెంట్స్ వద్ద ఉన్న అడ్డంకుల తొలగింపు, సీవరేజ్ పైపుల నిర్వహణపైనా చర్చించారు. విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా అధికార యంత్రాంగం, వీఎంసీ, రైల్వే అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాల్సి ఉందని ఎంపీ శివనాథ్ అన్నారు. అదే విధంగా రైల్వేతో సమన్వయం అవసరమైన పనుల్లో పురోగతిపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించాల్సిన
అవసరముందన్నారు. డీసిల్టింగ్, శానిటేషన్ తదితర పనులకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) రూపొందించి, దానిప్రకారం పనులను త్వరితగతిన చేపట్టనున్నట్లు కలెక్టర్ సృజన తెలిపారు.
సమావేశం అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో రైల్వేతో ముడిపడిన అంశాల్లో పురోగతి, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. నాలుగు ప్రధాన డ్రెయిన్లపై దృష్టిసారించామని, విజయవాడ అర్బన్ పరిధిలో రైల్వే, వీఎంసీ, ఆర్ అండ్ బీ, ఏపీసీపీడీసీఎల్, రెవెన్యూ అధికారులతో ఈ నెల 3, 4 తేదీల్లో, రూరల్ పరిధిలో ఈ నెల 7, 8 తేదీల్లో ఉమ్మడి తనిఖీలు నిర్వహించి, డ్రెయిన్ల స్థితిగతులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రతినెలా సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
**మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రాయనపాడు, కొండపల్లి, ఈలప్రోలు తదితర ప్రాంతాలకు సంబంధించి ఆర్‌వోబీల ప్రతిపాదనలను సమావేశం ముందుంచినట్లు తెలిపారు. సమస్యల సత్వర పరిష్కారంపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. సమావేశంలో నందిగామ ఆర్‌డీవో ఎ.రవీంద్రరావు, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ సీహెచ్ దుర్గాప్రసాద్, రైల్వే, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, వీఎంసీ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.