-గత ప్రభుత్వ సమయంలో బ్రష్టుపట్టిన వ్యవస్థలన్నిటినీ గాడిలో పెడతాం
-నేషనల్ కాలేజీ ని స్వాధీనం చేసుకుని ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తాం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో బ్రష్టుపట్టిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. కృష్ణా జిల్లాలో పర్యటనలో భాగంగా మచిలీపట్నంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణంలో ఎ.జె కళాశాలలో పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలతో పాటు పారిశుద్ద్యాన్ని కూడా గాలికి వదిలేసి రాష్త్రంలో కొన్ని కోట్ల మెట్రిక్ టన్నుల చెత్తను ఎక్కడికక్కడ నిల్వ చేసిందని, ఒక్క మచిలీపట్నంలోని 85 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త ఏమీ చేయకుండా వదిలేశారని, దీన్ని బట్టి వారి ప్రాధాన్యతలు ఏమిటో అర్ధం అవుతున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితిని తానూ తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎం చెప్పారు. ఇంతపెద్దఎత్తున పేరుకుపోయిన చెత్తను ప్రక్షాళన చేయడానికి రెండు నుండి 3 సంవత్సరాల సమయం పడుతుందని, అయినప్పటికీ రాష్ట్రంలో గత ప్రభుత్వం బ్రష్టు పట్టించిన ఇలాంటి వ్యవస్థలను తమ ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుందన్నారు. నేషనల్ (ఏ .జె) కాలేజీ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలియజేసారు.
రూ.3669 కోట్లతో పిపిటి పద్దతిలో బందరు పోర్ట్ నిర్మాణం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు: బందరు పోర్ట్ నిర్మాణాన్ని 2025 అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా పనులను మరింత వేగవంతం చేస్తామన్నారు. బందరు పోర్ట్ నిర్మాణ పనులను 3669 కోట్ల రూపాయలతో పిపిటి పద్దతిలో నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. బందరు పోర్ట్ పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కేవలం 865 కోట్ల రూపాయలతో 24 శాతం మేర పనులను మాత్రమే పూర్తి చేసారన్నారు. పోర్ట్ నిర్మాణంలో ప్రస్తుతం 4 బెర్త్ లతో మాస్టర్ ప్లాన్ ఉందని, 16 బెర్త్ లు వరకు అవసరం ఉంటుందని, అయినప్పటికీ ప్రస్తుతం పెంచాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రాజెక్టును నేను ప్రారంభించానని, గత ప్రభుత్వం పనులు చేయలేదన్నారు. ప్రస్తుతం తాము ఈ పనులన్నింటినీ పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. ప్రాజెక్ట్ కు ప్రస్తుతం 38.30 ఎకరాలు అవసరం అవుతాయని, వాటిలో 32 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, 6. 30 ఎకరాలు భూసేకరణ చేయాల్సిందింగా అధికారులను సి ఎం ఆదేశించారు. పోర్ట్ నిర్మాణానికి మొత్తం 3696 ఎకరాలు అవసరం ఉంటుందన్నారు. రాజధానికి అతి దగ్గరలో ఉండడంతో పోర్ట్ ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. మచిలీపట్నానికి జాతీయ రహదారి వచ్చిందని, రేపల్లె రైల్వే లైన్ కూడా పూర్తి అయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పోర్ట్ అనుసంధానంతో పరిసర ప్రాంతాలలో పారిశ్రామికాభివృద్ధికి ఎంతో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని ముఖ్యమంత్రి చెప్పారు. పోర్ట్ నిర్మాణానికి కావలసిన అన్ని అనుమతులు, మౌలిక సదుపాయాలు, ఇసుక, నీటి సౌకర్యం వంటి రా మెటీరియల్ కొరత లేకుండా ఫాస్ట్ ట్రాక్ విధానంలో అందించి పోర్ట్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, ఒక మంచి పోర్ట్ గా బందరు పోర్ట్ ను అభివృద్ధి చేస్తామన్నారు. పోర్ట్ నిర్మాణం మచిలీపట్టణం అన్ని విధాలుగా అభివృద్ధికి చెందేందుకు దోహదపడుతుందన్నారు.
మంత్రులు పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి , ఎమ్మెల్సీ కంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యే లు వెనిగళ్ళ రాము, కాగిత కృష్ణ ప్రసాద్ , వర్ల కుమార్ రాజు, మండలి బుద్ధ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ డి. కె. బాలాజీ ,జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు ,, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్, పోర్ట్ ఇంజనీర్ తులసీదాస్, ప్రభృతులు పాల్గొన్నారు.