Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

-ప్రాయశ్చిత్త దీక్ష విరమణ
-స్వామి వారికి ప్రత్యేక పూజలు..
-వారాహి డిక్లరేషన్ ను శ్రీవారి పాదాల ఉంచిన పవన్ కళ్యాణ్ 
-మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరణ

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని దీక్ష విరమించారు. 11 రోజులపాటు సాగిన ఆయన దీక్షలో భాగంగా ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపధ్యంలో సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత భుజాలకెత్తుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రికి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తన ఇద్దరు కుమార్తెలు ఆద్య కొణిదెల, పలీనా అంజని కొణిదెలలతో కలసి మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు. తన ఇద్దరు కుమార్తెలతో స్వామి వారి దర్శనానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేసి వారాహి డిక్లరేషన్ ని స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్ కి ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అన్నప్రసాద స్వీకరణ
స్వామి వారి దర్శనం అనంతరం  పవన్ కళ్యాణ్ నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రాన్ని సందర్శించారు. అన్నదాన కేంద్రంలోనూ ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికారు. భక్తులకు జరుగుతున్న అన్నదాన సరళిని పరిశీలించారు. అనంతరం సామాన్య భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.

చిన్న కుమార్తెతో డిక్లరేషన్
దర్శనానికి ముందు చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెలతో డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి చేయించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజనితో స్వయంగా డిక్లరేషన్ ఇప్పించారు. కుమార్తె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఫాంపై సంతకం చేశారు. పవన్ కళ్యాణ్ తో పాటు శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, తిరుపతి, రైల్వే కోడూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, అరవ శ్రీధర్, ప్రముఖ సినీ దర్శకులు త్రివిక్రమ్, కళా దర్శకులు ఆనంద సాయి స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *