Breaking News

కుల, మత, ప్రాంత, పార్టీ, వర్గాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో సంక్షేమం

-ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
-ఎర్రకాలువ ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం
-పర్యాటక కేంద్రంగా నిడదవోలు అభివృద్ధి
-నిడదవోలులోని చిన కాశి రేవు వద్ద పాడైన బ్రిడ్జి పరిశీలన.. నూతన బ్రిడ్జి ఏర్పాటుకు హామీ
-అధికారులు, ప్రజా ప్రతినిధులు, మంత్రి కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని వెల్లడి

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
కుల, మత, ప్రాంత, పార్టీ, వర్గాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో సంక్షేమం అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శుక్రవారం సమిశ్రగూడెంలోని స్థానిక ఎంపీడివో కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన  మండల స్థాయి సమీక్ష సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై మండల స్థాయి అధికారులతో మంత్రి సమీక్షించారు. వ్యవసాయం, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్, సంక్షేమ పథకాలు, వివిధ రకాల పింఛన్లు అమలు తీరు తదితర శాఖలపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అధికారులంతా సమన్వయంతో పని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో అమలు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చాలా శాఖలకు కొత్తగా అధికారులు వచ్చారని, వారికి ఎంపీడీవో, ఎమ్మార్వోలు తగిన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాల మేరకు క్షేత్రస్థాయిలో  చేపట్టవలసిన పనులకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని అవి ఎంత మేరకు అమలు చేస్తున్నామో అధికారులు పరిశీలించుకోవాలన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమ పాళ్లలో అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. అంతిమంగా ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని గుర్తుచేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వానికి మంచి పేరును తెచ్చే బాధ్యత అందరిపై ఉందన్నారు.

నిడదవోలు నియోజవర్గ అభివృద్ధికి చర్యలు
నిడదవోలు నియోజవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు సూచించారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. అవసరమైతే జిల్లా పరిషత్ నిధులను నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై త్వరలోనే జడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఛైర్మన్ తో కలిసి సానుకూలంగా స్పందించేందుకు సహకరిస్తామన్నారు.

ఎర్రకాలువ ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం
నిడదవోలు రూరల్ మండలంలో జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సంభవించిన అధిక వర్షాలు, ఎర్రకాలువ వరదల వల్ల పలు గ్రామాల్లో తలెత్తిన ఇబ్బందులు, సంబంధిత ఘటనపై సమాయత్తం అయిన విధానాన్ని మంత్రి వివరించారు. ముందస్తుగానే జాగ్రత్తపడితే తద్వారా తలెత్తే ఇబ్బందిని అరికట్టవచ్చని సూచించారు. ఎర్రకాలువ వల్ల పంట పొలాలు ముంపు గురై రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తెలిపారు.ఈ క్రమంలో పంట నష్టపోయిన రైతులందరికీ త్వరితగతిన ఇన్ ఫుట్ సబ్సిడీ అందజేసే విధంగా తగు చర్యలు చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు. ఎర్రకాలువ ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం చేసే దిశగా ఆధునికీకరణ పనులను త్వరలోనే చేపడతామన్నారు.

సీసీ రోడ్లకు సమాంతరంగా డ్రెయిన్ల నిర్మాణం
నిడదవోలు నియోజకవర్గంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రింద ఇప్పటికే రోడ్లు, సీసీ రోడ్లు మంజూరయ్యాయని, నాణ్యత లోపించకుండా వేగవంతంగా పనులు చేపట్టాలన్నారు. సీసీరోడ్లకు సమాంతరంగా డ్రెయిన్లు చేపట్టాల్సిన ఆవశ్యకతను మంత్రి తెలిపారు. రహదారులు, డ్రెయిన్స్ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ప్రతిపాదనలు రూపొందించామని, ఎక్కడెక్కడ ఎంత మేర డ్రెయిన్లు అవసరమో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ ఆఫీసర్ కృష్ణతేజకు వివరించామన్నారు. త్వరలోనే వాటిని ప్రారంభించే కార్యక్రమాలు చేపడతామన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల వివరాలు తమ దృష్టికి తెస్తే వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

సంతృప్తి స్థాయిలో 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల పాలనలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కందుల దుర్గేష్ గుర్తుచేశారు. క్రమం తప్పకుండా ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారుల గుమ్మాల వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నామన్నారు. గడిచిన నెలలో ఒకటవ తేదీ ఆదివారం రావడం వల్ల ముందు రోజే 31వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేశామన్న విషయం గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లు ఇంటి వద్ద పంపిణీ చేయరు, ఒకటవ తేదీన రావు అన్న అనుమానాలను పటాపంచలు చేశామన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్న విషయాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.

పర్యాటక శాఖకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందిస్తుందని ఈ నేపథ్యంలో నిడదవోలును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇసుక విషయంలో కొత్త విధానం వచ్చిందని, త్వరలోనే డిమాండ్ కు తగ్గట్లు సరఫరా చేస్తామన్నారు. కలెక్టర్ తో ఈ అంశంపై చర్చిస్తామన్నారు

ఆర్ డబ్ల్యూఎస్ లో భాగంగా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతీ గ్రామానికి, నిడదవోలు పట్టణానికి మంచి నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్వోబీల నిర్మాణం, నాణ్యత విషయాన్ని స్వయంగా పరిశీలిస్తానని మంత్రి తెలిపారు.

నిడదవోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో సరైన వైద్య సదుపాయాలు అందించాలని మంత్రి సూచించారు. మార్కొండపాడు పీహెచ్ సీలో సౌకర్యాలు పెంచాల్సిన అంశంపై దృష్టిసారిస్తామన్నారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరని అని అధికారులకు, వైద్యులకు మంత్రి సూచించారు. అవసరమైన మేరకు మెడిసిన్ ను అందుబాటులో ఉంచాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు, రోగులకు వైద్య సేవలు అందించే విషయంలో వైద్యులు మానవతాధృక్పథంతో పని చేయాలని కోరారు.

మీరే వారథులు
ప్రభుత్వానికి, ప్రభుత్వ నిర్ణయాలకు, అమలు చేస్తున్న అధికారులకు మధ్యలో ఉండాల్సిన వ్యక్తులు ఎంపీటీసీలు, సర్పంచ్ లు అని, ఈ సందర్భంగా వారి పాత్రను మంత్రి గుర్తుచేశారు. కుల మత, ప్రాంత, పార్టీ, వర్గాలకు అతీతంగా పేద ప్రజలకు, అర్హులకు సంతృప్త స్థాయిలో పథకాలు అందుతున్నాయా లేదా పరిశీలించాలన్నారు. పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ న్యాయం చేయాలని తెలిపారు. స్థానిక ప్రజలతో బాంధవ్యం ఉంటుంది కాబట్టి సంబంధిత వినతులను, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నేతలు, అధికారులతో కలిసి నిడదవోలు లోని చిన కాశి రేపు వద్ద శిథిలావస్థకు గురైన బ్రిడ్జిని పరిశీలించారు. పొలాలకు వెళ్లాలన్నా, స్మశాన వాటికకి చేరుకోవాలన్నా కీలకమైన బ్రిడ్జి గురించి, నూతన బ్రిడ్జి ఆవశ్యతను గురించి మంత్రికి అధికారులు, స్థానిక నేతలు వివరించారు. నూతన బ్రిడ్జి ఏర్పాటుపై అధికారులతో చర్చించి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి.శామ్యూల్, తహసిల్దార్ బి.నాగ రాజు నాయక్, ఎంపీపీలు తిరుమల్ల భాగ్యలక్ష్మి, కానుబోయిన ప్రభావతి, జెడ్పీటిసి సభ్యుడు కొయ్య సూరిబాబు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *