-తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం వేసిన సిట్‌ను రద్దు చేసి, నూతన కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం చంద్రబాబు సర్కార్‌కు చెంపపెట్టు అని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గురుమూర్తి సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. గురుమూర్తి ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే…. “ఏపీ ప్రభుత్వం వేసిన సిట్‌తో సరైన విచారణ జరగదని వైసీపీతో పాటు హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేశారని ఆరోపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణల్ని నిజం చేసేందుకు సిట్ దర్యాప్తు చేస్తుందని అందరూ విమర్శించారు. సిట్ అనేది నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయదనే అభిప్రాయాన్ని బలపరిచేలా… సర్వోన్నత న్యాయస్థానం కూడా అలాంటి కామెంట్సే చేసింది. నిష్పక్షపాత దర్యాప్తు కోసం సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా తిరుమలపై రాజకీయ ఆరోపణలు చేయొద్దు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించొద్దు. తిరుమల కేంద్రంగా కక్షపూరిత రాజకీయాలకు తెరదించాలి” అని తిరుపతి ఎంపీ ఆకాంక్షించారు.