-నిరంతరం పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
-దసరా ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి
-శాఖల మధ్య సమన్వయంతో దర్శనం సులభతరం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రులు నేటికి 5వ రోజు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సామాన్య భక్తులకు సులభతరమైన దర్శనం అందించాలన్న సంకల్పంతో దేవాదాయ శాఖ, పోలీస్, రెవెన్యూ, నగరపాలక సంస్థ శాఖల ఉన్నతాధికారులు నిరంతరం భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా అమ్మ దర్శనం కోసం కొండపైకి వచ్చే వేలాది మంది భక్తులు సంతృప్తికర స్థాయిలో ఆధ్యాత్మిక అనుభవం పొందేందుకు ఎన్నో ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అవసరమైన త్రాగునీరు, మజ్జిగ, పాలను నిరంతరం స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా సాధారణ భక్తులకు సులభతరమైన దర్శనం అందించేందుకు దేవాదాయ శాఖ చేసిన ఏర్పాట్ల వల్ల క్యూ లైన్లు వేగంగా ముందుకు కదులుతున్నాయి.*
స్వచ్ఛంద సంస్థల సేవలు ప్రశంసనీయం..
ఎన్.ఎస్.ఎస్., రెడ్‌క్రాస్ సంస్థలు సహా వివిధ కళాశాలల నుంచి యువతీ, యువకులు సామాజిక బాధ్యతతో అందిస్తున్న సేవలు భక్తులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు. ప్రధానంగా కొండపైకి వచ్చే వృద్ధులు, వికలాంగులు జగన్మాతను దర్శించుకునేందుకు వీలుగా వీల్‌ఛైర్లలో వారిని రాజగోపురం వరకు తీసుకువెళ్లి దర్శనం పూర్తయ్యాక తిరిగి ఓంకారం మలుపు వరకు తీసుకువస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఇదే సదుపాయాలని మరింత విస్త్రతంగా నిర్వహిస్తున్నారు. పోలీస్ సేవాదల్ సిబ్బంది సైతం వృద్ధులకు, వికలాంగులకు తమదైన శైలిలో సేవలందించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దసరా ఉత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు భక్తులకు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ప్రతిరోజూ దేవాలయాన్ని సందర్శించి భక్తులపై ఆరా తీస్తూ తక్షణ పరిష్కారం కోసం వేగంగా చర్యలు తీసుకోవడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.