-పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు మంగళవారం ఉదయం అమరావతి సచివాలయం నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈ నెల 14 నుండి 20 వరకు జిల్లాలలో నిర్వహించే పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ డా. జి సృజన, డ్రామా ప్రాజెక్ట్ డైరెక్టర్ సునీత ఆర్ అండ్ బి ఎస్ఈ సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, గ్రామ సర్పంచులు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. గత ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13,325 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయించిన పనులకు కలెక్టర్లే పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందని, అన్ని పనులు 14 నుంచి వారం రోజుల వ్యవధిలో శంకుస్థాపనలు నిర్వహించి, సంక్రాంతి లోగా పనులు పూర్తి చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.2,500 కోట్లతో దాదాపు 20వేల పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
జిల్లాలో 90 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, బిటి రోడ్లు, గోకులాల నిర్మాణ పనులు జిల్లా కలెక్టర్ జి సృజన
జిల్లాలో పల్లె పండగ- పంచాయతీ వారోత్సవాలను నిర్వహించేందుకు పూర్తి సంసిద్ధంగా ఉన్నామని అన్నారు. జిల్లాలో భూమి పూజ నిర్వహించవలసిన అన్ని పనులను గుర్తించామని తెలిపారు. కార్యక్రమానికి సంబంధించి ప్రజాప్రతినిధులకు సమాచారం అందించి షెడ్యూల్ తయారు చేయడం జరిగిందని తెలిపారు. పంచాయతీలకు సంబందించిన సమాచార బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి పంచాయతీలో సి.సి. రోడ్లు, బి.టి రోడ్లు గుర్తించిన పనులకు ఒక్కొక్క మండలానికి 5 కోట్లు చొప్పున 16 మండలాలకు రూ80 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, వీటితోపాటు ఒక్కొక్క మండలానికి 25 చొప్పున 16 మండలాలలో మొత్తం 400 గోకుల నిర్మాణానికి 10 కోట్ల కోట్లతో శంకుస్థాపన నిర్వహించి సంక్రాంతి లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఉప ముఖ్యమంత్రికి తెలిపారు.. ప్రతి పంచాయతీ కవర్ అయ్యే విధంగా అనిమల్ షెల్టర్స్( గోకులాలు) మంజూరు చేయడం జరిగిందన్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్ అందుబాటులో ఉందని తెలిపారు.