Breaking News

ఆలయాల్లో ప్రసాదంతోపాటు మొక్క ఇవ్వాలనే షాయాజీ షిండే ఆలోచన స్వాగతిస్తున్నాము

-రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఇచ్చే విషయమై ముఖ్యమంత్రి తో చర్చిస్తాను: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-ఆధ్యాత్మికతకు పర్యావరణ శక్తి కలిస్తే భావి తరాలకు మేలు
-ముంబైలోని మూడు ఆలయాల్లో వృక్ష ప్రసాదం పంపిణీ: ప్రముఖ నటులు షాయాజీ షిండే
-మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో సమావేశమైన షాయాజీ షిండే

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్క కూడా భక్తులకు ఇస్తే పచ్చదనాన్ని పెంపొందించవచ్చు అనే షాయాజీ షిండే  సూచనను స్వాగతిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అభినందనీయమైన ఆలోచన అన్నారు. ఆయన చేసిన సూచన అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో చర్చిస్తామని చెప్పారు. మంగళవారం రాత్రి ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో ప్రముఖ నటులు షాయాజీ షిండే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన ఆలోచనలు పంచుకున్నారు. ఈ విధంగా వృక్ష ప్రసాద్ యోజనను మహారాష్ట్రలో మూడు ప్రముఖ ఆలయాల్లో అమలు చేస్తున్నారని షిండే తెలిపారు. ఈ సందర్భంగా మొక్కలు, వాటి విశిష్టత గురించి మరాఠీలో రాసుకున్న కవితను పవన్ కళ్యాణ్ కి చదివి వినిపించారు. ఆ కవితను పవన్ కళ్యాణ్  ప్రశంసిస్తూ ఆ మరాఠీ కవితను తెలుగులో అనువదించి చెప్పడం విశేషం.
ఈ సందర్భంగా షాయాజీ షిండే మాట్లాడుతూ “మనిషి మనుగడ ప్రకృతితో ముడిపడి ఉంది. ప్రపంచంలో ఏ మత ధర్మం అయినా ప్రకృతిని సంరక్షించుకుంటేనే భవిష్యత్తు అని బోధిస్తున్నాయి. వచ్చే తరాలకు సుందరమైన పర్యావరణం అందించాలంటే చిన్ననాటి నుంచే నేటి తరానికి మొక్కల విశిష్టతను తెలపాల్సిన అవసరం ఉంది. దీని కోసం ఆలయాలకు పూజల నిమిత్తం వచ్చే భక్తులకు ప్రసాదంతోపాటు మొక్కలను అందించి వాటిని పెంచేలా ప్రోత్సహించాలి. ఈ ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. మహారాష్ట్రలో సిద్ధి వినాయక ఆలయం, దగదుశేథ్ గణపతి ఆలయం, మహాలక్ష్మి ఆలయాల్లో వృక్ష ప్రసాద్ యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. విరివిగా మొక్కలను నాటడం తన జీవన అలవాట్లలో భాగం అయ్యింది. నా తల్లి కన్ను మూసినప్పుడు ఆమె బరువుకు సరితూగే విత్తనాలను చాలా ప్రాంతాల్లో నాటాను. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తో పంచుకున్నారు. దేవాలయాలకు వెళ్లే భక్తులకు ప్రసాదాలతోపాటు మొక్కలను దేవుడు ఇచ్చిన బహుమతిగా అందిస్తే వాటిని వారు నాటడం, సంరక్షించడం దైవ కార్యంగా భావిస్తారు. ఆధ్యాత్మికతకు పర్యావరణ శక్తి కలిస్తే భావి తరాలకు మేలు కలుగుతుంది” అన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *